గగనతలం మూసివేత.. ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి

గగనతలం మూసివేత.. ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి

ఉక్రెయిన్లో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ మరో అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. ఉక్రెయిన్ లో మార్షల్ లా అమల్లో ఉన్నందున రాకపోకలు సాధ్యంకావని, కీవ్ లో చిక్కుకుపోయిన విద్యార్థులకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పింది. దగ్గరలో బాంబ్ సైరన్ శబ్దాలు వినిపిస్తే విద్యార్థులు వెంటనే గూగుల్ మ్యాప్స్లో ఉన్న వివరాల ఆధారంగా బాంబ్ షెల్టర్లకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. భారత పౌరులంతా పశ్చిమ ఉక్రెయిన్ వైపు తరలివెళ్లాలని, పాస్ పోర్టులతో ఇతర డాక్యుమెంట్లు తమ వెంట పెట్టుకోవాలని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది. తాజా సమాచారం కోసం ఎంబసీ వెబ్సైట్, సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో కావాలని సూచించింది.

మరోవైపు రష్యా బాంబు దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసివేసింది. ఫలితంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధమైన వేలాది మంది భారతీయులు ఉక్రెయిన్లో చిక్కుకుపోయారు. కీవ్లోని ఎయిర్ పోర్టులో ఫ్లైట్ల కోసం వందల మంది పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం వారిని భారత్కు తీసుకువచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. గగనతలం మూసివేసినందున ఇతర మార్గాల్లో వారిని రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఉక్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ.. భారతీయులకు నిరంతరం అందుబాటులో ఉంటుందని, రాయబార కార్యాలయం జారీ చేసిన మార్గదర్శకాలు పాటించాలని ప్రభుత్వం సూచించింది.