కెనడా నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తూ మృత్యువాత

కెనడా నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తూ మృత్యువాత

కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ ఓ భారతీయ కుటుంబంతో సహా ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. వీరంతా కలిసి సెయింట్ లారెన్స్ నది మీదుగా పడవ ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చనిపోయిన వారిలో ఆరుగురు పెద్దలు, ఇద్దరు చిన్నారులున్నారు. కెనెడా- అమెరికా బార్డర్ లోని సెయింట్ లారెన్స్ చిత్తడి ప్రాంతంలో పోలీసులు వీరందరి మృతదేహాలను గుర్తించారు.

మృతుల్లో భారత్‌ తో పాటు రొమేనియాకు చెందిన రెండు కుటుంబాలు ఉన్నాయని బీబీసీ నివేదించింది. పోలీసులు మొదటగా 6 మృతదేహాలను వెలికి తీయగా.. తాజాగా హెలికాప్టర్ ద్వారా జరిపిన మరో రెండు మృతదేహాలను గుర్తించారు. మార్చి 30న రాత్రి ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు అధికారులు 8 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీరందరూ కెనడా నుంచి అక్రమంగా యూఎస్‌లోకి ప్రవేశిస్తూ మృత్యువాత పడినట్టు తెలిపారు. మృతి చెందిన మూడేళ్ల చిన్నారికి కెనడా పాస్‌పోర్టు ఉన్నట్టు పేర్కొన్నారు.  

ఈ ఘటనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో  "ఇది హృదయ విదారకమైన ఘటనగా పేర్కొన్నారు. ఏం జరిగిందో, ఎలా జరిగిందో మనం సరిగ్గా అర్థం చేసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. గతేడాది డిసెంబరులోనూ  యూఎస్‌లో ఉన్న భార్యా, పిల్లలను కలిసేందుకు నది దాటేందుకు ప్రయత్నించిన ఫ్రిట్జ్‌నెల్ రిచర్డ్ ఇలాగే ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.