
సెయింట్ లూసియా (అమెరికా): ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద.. సింక్ ఫీల్డ్ కప్‌లో రెండో విజయాన్ని నమోదు చేశాడు. మంగళవారం జరిగిన ఏడో రౌండ్‌లో ప్రజ్ఞానంద 27 ఎత్తులతో అలిరెజా ఫిరౌజ (ఫ్రాన్స్)పై గెలిచాడు. ఫలితంగా నాలుగున్నర పాయింట్లతో ఫ్యాబియానో కరువానతో కలిసి సంయుక్తంగా టాప్‌లో కొనసాగుతున్నాడు. రోసోలిమో స్ట్రాటజీతో ఆడిన ప్రజ్ఞా.. అలిరెజాకు ఎలాంటి చాన్స్ ఇవ్వలేదు. సిసిలియన్ వ్యూహాన్ని సమర్థంగా తిప్పికొట్టాడు. మిడిల్ గేమ్‌లో సరైన ఎత్తులు వేసిన ఇండియన్ ప్లేయర్ బిషప్‌ను ముందుపెట్టి అటాకింగ్ గేమ్ ఆడాడు.
వ్యూహాత్మక ఎత్తుల కోసం వేచి చూసిన అలిరెజా ఎండ్ గేమ్‌లో చేసిన తప్పిదం ప్రజ్ఞాకు కలిసొచ్చింది. మరో గేమ్‌లో డి. గుకేశ్ (3).. వెస్లీ సో (అమెరికా, 4) చేతిలో ఓడాడు. నల్ల పావులతో బెర్లిన్ డిఫెన్స్ ఆడిన గుకేశ్‌ను మిడిల్ గేమ్‌లో వెస్లీ అద్భుతంగా కట్టడి చేశాడు. కౌంటర్ ప్లేలో గుకేశ్ వరుసగా పావులను కోల్పోవడం మైనస్‌గా మారింది. ఇతర గేమ్‌ల్లో డుడా జాన్ క్రిస్టోఫ్ (పోలెండ్, 3.5).. నొడిర్బెక్ అబ్దుసత్తారోవ్ (ఉజ్బెకిస్తాన్, 1.5)పై గెలవగా, కరువాన (అమెరికా).. లెవోన్ అరోనియన్ (అమెరికా, 4), మ్యాక్సిమ్ వాచిర్ లాగ్రేవ్ (ఫ్రాన్స్, 3.5).. శామ్యూల్ సెవియన్ (అమెరికా, 3.5) మధ్య జరిగిన గేమ్‌లు డ్రా అయ్యాయి.