అమెరికా ఎన్నికల ఖర్చు లక్షా 20 వేల కోట్లు.. భారత్ ఎన్నికల ఖర్చు లక్షా 35 వేల కోట్లు

అమెరికా ఎన్నికల ఖర్చు లక్షా 20 వేల కోట్లు.. భారత్ ఎన్నికల ఖర్చు లక్షా 35 వేల కోట్లు

ప్రస్తుత లోక్​సభ ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలుస్తాయని ఎక్స్​పర్టులు అంచనా వేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, పార్టీలు, అభ్యర్థులు కలిపి.. దాదాపు రూ. 1.35 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్తున్నారు. పోయినసారి 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రూ. 60 వేల కోట్లు ఖర్చయినట్లు అంచనా వేయగా.. ఈసారి అంతకు రెట్టింపుగా రూ.1.35 లక్షల కోట్లు వ్యయం కావచ్చని పేర్కొంటున్నారు. గత 35 ఏండ్లుగా ఎన్నికల ఖర్చును ట్రాక్ చేస్తున్న సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) సంస్థ చైర్మన్ ఎన్.భాస్కరరావు ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల కన్నా మన లోక్ సభ ఎన్నికలే ఖరీదైనవిగా మారాయని భాస్కరరావు చెప్పారు. 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 14.4 బిలియన్ డాలర్లు (రూ. 1.2 లక్షల కోట్లు) ఖర్చు అయినట్టుగా ఓపెన్ సీక్రెట్స్ డాట్ ఆర్గ్ సంస్థ అంచనా వేసిందన్నారు. ఇప్పుడు 2024 లోక్ సభ ఎన్నికల ఖర్చు ఆ రికార్డ్ ను అధిగమించి, రూ. 1.35 లక్షల కోట్లకు చేరే అవకాశాలు ఉన్నందున ఇవి ప్రపంచంలోనే అతి ఖరీదైన ఎన్నికలుగా నిలుస్తాయన్నారు.