FBలో జాబ్ కోల్పోయిన ఎన్నారై.. సాయం కోరుతూ సోషల్ మీడియా పోస్ట్ 

FBలో జాబ్ కోల్పోయిన ఎన్నారై..  సాయం కోరుతూ సోషల్ మీడియా పోస్ట్ 

ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా కొన్ని రోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. అప్పటి నుంచి ఈ అంశంపై సోషల్ మీడియాను రకరకాల పోస్టులు పోటెత్తుతున్నాయి.  ఇదే క్రమంలో ఫేస్ బుక్ లో ఉద్యోగం కోల్పోయిన రాజు కడం అనే LinkedIn యూజర్ తన గుండె గోడును వెళ్లబోస్తూ పెట్టిన  వారం క్రితం పెట్టిన ఓ పోస్టు వైరల్ గా మారింది. దీనికి ఇప్పటివరకు 24వేలకుపైగా లైక్స్ వచ్చాయి. రాజు కడం మెసేజ్ ను చూసి చలించిపోయిన కొందరు నెటిజన్స్.. ఆయనకు జాబ్ ఆఫర్ ఇస్తామంటూ ముందుకొచ్చారు. కష్టకాలంలోనే ధైర్యంగా నిలబడాలంటూ ఆయనను ఆప్యాయంగా ఓదార్చే మెసేజ్ లు ఇంకొందరు పెట్టారు. ఇంతకీ రాజు కడం ఏమని మెసేజ్ చేశారో ఇప్పుడు చూద్దాం.. 

9 నెలల క్రితమే చేరాను.. అంతలోనే..

‘‘జాబ్ కట్స్ లో భాగంగా ఫేస్ బుక్ లో ఉద్యోగం కోల్పోయిన 11వేల మందిలో నేనూ ఒకణ్ని.  16 ఏళ్ల నుంచీ నేను అమెరికాలోనే ఉంటున్నా. సీనియర్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్ హోదాలో 9 నెలల క్రితమే ఫేస్ బుక్ లో చేరాను. ఇంతలోనే అర్ధాంతరంగా జాబ్ పోయింది. కంపెనీలో చేరినప్పటి నుంచి నా పనితీరు బాగానే ఉంది. ఈవిధంగా జాబ్ కోల్పోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.  నాకు ఏదైనా ఉద్యోగ అవకాశం ఉంటే చెప్పండి. హెచ్1బీ వీసా గడువు ముగిసేలోగా నేను కొత్త జాబ్ ను వెతుక్కోవాల్సి ఉంటుంది. లేదంటే కుటుంబంతో సహా అమెరికా నుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది. నా ఇద్దరు పిల్లలు అర్జున్, యశ్ లకు అమెరికన్ సిటిజెన్ షిప్ ఉంది. అకస్మాత్తుగా నేను అమెరికా నుంచి వెళ్లాల్సి వస్తే నా పిల్లల కెరీర్ కు కూడా ఇబ్బంది కలుగుతుంది. నేను అమెరికాలోనే ఉండేలా ఎవరైనా సాయం చేయండి. సాధ్యమైనంత త్వరగా ఉద్యోగ అవకాశం ఏదైనా ఉంటే చెప్పండి’’ అని రాజు కడం మెసేజ్ పెట్టారు. దీనితో పాటు తాను ఫేస్ బుక్ లో పనిచేసినప్పటి ఐడీ కార్డును, ఇద్దరు పిల్లల ఫొటోను తన పోస్ట్ కు ట్యాగ్ చేశారు. 

నెటిజన్స్ సానుకూల స్పందన

LinkedIn  వేదికగా రాజు కడం పెట్టిన పోస్టుకు కొందరు నెటిజన్స్ సానుకూలంగా స్పందించారు. ఆయనకు తమవంతుగా సాయం చేసేందుకు ముందుకొచ్చారు. జాబ్ ఆఫర్ ఇస్తామంటూ పలువురు ఆయనకు మెసేజ్ పంపారు. ‘‘ఉద్యోగం కోల్పోయిన పరిస్థితుల్లో అకస్మాత్తుగా అమెరికా నుంచి ఇండియాకు కుటుంబంతో సహా  వెళ్లిపోవడం అంటే చాలా కష్టతరం. మీకు ఏదైనా ఉద్యోగ అవకాశం ఇప్పించేందుకు నావంతుగా ట్రై చేస్తాను’’ ఓ లింక్డ్ ఇన్ యూజర్ మెసేజ్ చేశారు. ‘‘మీతో కలిసి ఫేస్ బుక్ లో పనిచేసిన రోజులను మర్చిపోలేను. మిస్ యూ’’ అంటూ ఫేస్ బుక్ లో రాజుతో కలిసి పనిచేసిన సహోద్యోగి ఒకరు మెసేజ్ చేశారు.