ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ గా భారత సంతతి యువతి విజయం

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ గా భారత సంతతి యువతి విజయం

లండన్‌ : ప్రపంచ ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ  విద్యార్థి సంఘం (ఎస్‌యు) అధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన యువతి అన్వీ భూటానీ విజయం సాధించింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలోని మాగ్దాలిన్ కాలేజీలో మానవ శాస్త్ర (హ్యూమన్ సైన్స్ ) విద్యార్థిని అయిన అన్వీ భుటానీ 2021-22 సంవత్సరానికి జరిగిన ఉప ఎన్నికల్లో  భారీ విజయం సాధించారు. నిన్న రాత్రి ఫలితాలు వెలువడగా భారత సంతతి విద్యార్థి అన్వి ఘన విజయం సాధించింది. భారత సంతతికి చెందినవారు  స్టూడెంట్ యూనియన్ పదవి ఈ పదవిని దక్కించుకోవడం ఇది రెండవ సారి. గత ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో భారతీయ సంతతి విద్యార్థి రష్మీ సుమంత్‌ గెలుపొందింది. అయితే ఇటీవల ఆమె సోషల్ మీడియాలో న్ని వివాదాస్పద పోస్టులు పెట్టడంతో..ఆమె ఆ పదవి నుండి ఆమె వైదొలగాల్సి వచ్చింది. దీంతో తిరిగి ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ఎన్నికల ప్రచార సమయంలో అన్వి భుటానీ తన మ్యానిఫెస్టోలో కీలకమైన అంశాలను పొందుపరచింది. ముఖ్యంగా ఆక్స్ ఫర్డ్ లో  ప్రస్తుతం ఇస్తున్న వేతనంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు, క్రమ శిక్షణా చర్యలు, పాఠ్యాంశాలను మానవ జీవనానికి ఉపయోగపడే రీతిలో ఆధునీకరించడం వంటి అంశాలు పొందుపరచి విశేష ప్రచారం చేసింది. అన్వీ భుటానీ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు యూనివర్సిటీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. అవే చివరకు ఆమె ఘన విజయాన్ని చేకూర్చిపెట్టాయని విద్యార్థి న్యూస్‌పేపర్‌ ‘చెర్‌వెల్‌’ విశ్లేషించింది.