సునీతా విలియమ్స్ రిటైర్మెంట్.. నాసాలో 27 ఏండ్ల సర్వీసు తర్వాత పదవీవిరమణ

సునీతా విలియమ్స్ రిటైర్మెంట్.. నాసాలో 27 ఏండ్ల సర్వీసు తర్వాత పదవీవిరమణ
  • 3 మిషన్లతో స్పేస్​లో 608 రోజులు గడిపిన ఆస్ట్రొనాట్

భారత సంతతి అమెరికన్  వ్యోమగామి (ఆస్ట్రొనాట్) సునీతా విలియమ్స్ రిటైర్ అయ్యారు. ఆమె మొత్తం మూడు మిషన్లలో పాల్గొని స్పేస్ లో 608 రోజులు గడిపారు. ఆమె 9 స్పేస్ వాక్​లు చేసి 62 గంటల 6 నిమిషాలు స్పేస్ లోనే ఉన్నారు. స్పేస్​లో మారథాన్  చేసిన మొదటి వ్యక్తిగానూ రికార్డు సృష్టించారు.

న్యూఢిల్లీ: భారత సంతతి అమెరికన్  వ్యోమగామి (ఆస్ట్రొనాట్) సునీతా విలియమ్స్  రిటైర్  అయ్యారు. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గత నెల 27 నుంచి ఆమె రిటైర్ మెంట్ అమల్లోకి వచ్చిందని నాసా అడ్మినిస్ట్రేటర్ జేర్డ్  ఐసాక్ మన్  తెలిపారు. ‘‘నాసాలో సునీతా విలియమ్స్  27 ఏండ్ల పాటు పనిచేశారు. 

మానవసహిత అంతరిక్ష రంగంలో ఆమె ఒక మార్గదర్శకురాలిగా నిలిచారు. తన నాయకత్వంతో భవిష్యత్తు ఆవిష్కరణలను మరింత తీర్చిదిద్దారు. దిగువ భూకక్ష్య (లో ఎర్త్ ఆర్బిట్) కు సంబంధించిన మిషన్లకు మార్గాన్ని మరింత సుగమం చేశారు. సైన్స్ అండ్  టెక్నాలజీకి అభివృద్ధికి కృషి చేశారు. అలాగే మూన్, మార్స్  మిషన్లకు పునాది వేశారు. అంతరిక్ష రంగంలో ఆమె అసాధారణ విజయాలు సాధించారు” అని ఐసాక్ మన్ పేర్కొన్నారు. తన అసాధారణ విజయాలతో భావితరాలకు సునీత స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. నాసాతో పాటు అమెరికాకు ఆమె అందించిన సేవలకుగాను సునీతకు నాసా తరపున అభినందనలు తెలిపారు.

స్పేస్​లో 608 రోజులు

సునీతా విలియమ్స్  1998లో నాసాకు ఎంపికయ్యారు. మొత్తం మూడు మిషన్లలో ఆమె పాల్గొని స్పేస్ లో 608 రోజులు గడిపారు. ఇన్ని రోజులు అంతరిక్షంలో గడిపిన నాసా రెండో ఆస్ట్రొనాట్ గా ఆమె రికార్డు సృష్టించారు. చివరగా తన సహోద్యోగి బుచ్  విల్ మోర్ తో కలిసి 2024లో బోయింగ్  స్టార్ లైనర్, స్పేస్ ఎక్స్ క్ర్యూ9 మిషన్లలో పాల్గొన్నారు. 

ఆ మిషన్ లో వారిద్దరూ 286 రోజులు అంతరిక్షంలో ఉన్నారు. అలాగే, సునీత మొత్తం 9 స్పేస్ వాక్ లు చేసి 62 గంటల 6 నిమిషాలు స్పేస్ లోనే ఉన్నారు. ఇప్పటి వరకూ ఒక మహిళా వ్యోమగామి సృష్టించిన రికార్డు ఇదే. మొత్తంగా ఈ జాబితాలో ఆమె నాలుగో ర్యాంకు సాధించారు. స్పేస్ లో మారథాన్  చేసిన మొదటి వ్యక్తిగానూ రికార్డు సృష్టించారు.