తాలిబన్ల దాడిలో భారత ఫొటో జర్నలిస్టు మృతి

తాలిబన్ల దాడిలో భారత ఫొటో జర్నలిస్టు మృతి

కాందహార్: అప్గానిస్థాన్‌లో తాలిబన్లు క్రమంగా పట్టుబిగిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని 80 శాతానికి పైగా గ్రామాలు, సరిహద్దులను తాలిబన్లు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌లో ఏం జరుగుతోందనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలని చూశాడో ఫొటో జర్నలిస్టు. కానీ అక్కడి సైనికులు, తాలిబన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆయన కన్నుమూశారు. ఆయనే భారత్‌కు చెందిన ప్రముఖ ఫొటో జర్నలిస్ట్, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిష్ సిద్దిఖీ. కాందహార్ సిటీలోని స్పిన్ బోల్డాక్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.  రిపోర్టింగ్ అసైన్‌మెంట్ కోసం అఫ్గాన్ స్పెషల్ ఫోర్సెస్‌తో కలసి సిద్దిఖీ కాందహార్‌కు వెళ్లారు. సిద్దిఖీ మృతిపై భారత్‌లో అఫ్గానిస్థాన్ అంబాసిడర్ ఫరిద్ మముంజే సంతాపం వ్యక్తం చేశారు. సిద్దిఖీ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని ఫరిద్ ట్వీట్ చేశారు. 

సిద్దిఖీ టెలివిజన్ న్యూస్ కరస్పాండెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఫొటో జర్నలిజం వైపు అడుగులు వేశారు. 2017 నుంచి ప్రముఖ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్‌లో ఆయన పని చేస్తున్నారు. సిద్దిఖీ మృతిని రాయిటర్స్ ధ్రువీకరించింది. తమ ఫొటో జర్నలిస్ట్ సిద్దిఖీ అఫ్గానిస్తాన్‌లో చనిపోవడం తీవ్ర వేదనకు గురిచేసిందని రాయిటర్స్ ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రీడెన్‌బరో, ఎడిటర్ ఇన్ చీఫ్ అలెస్సాండ్రా గలోనీ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, రాయిటర్స్ టీమ్‌లో పని చేస్తున్న సమయంలో 2018లో రోయింగ్యా రెఫ్యూజీ క్రైసిస్‌పై ఓ డాక్యుమెంటరీ తీశారు. దీనికి గానూ ఫీచర్ ఫొటోగ్రఫీ విభాగంలో సహచరుడు అడ్నాన్ అబిదీతో కలసి సిద్దిఖీ పులిట్జర్ అవార్డు దక్కించుకున్నారు.