యూట్యూబ్‌లో ఈ సింగర్కి 50 లక్షల పైగా సబ్‌‌‌‌స్క్రయిబర్స్.. అందులో ఒక్క పాటకే 80 మిలియన్ల వ్యూస్‌‌‌‌

యూట్యూబ్‌లో ఈ సింగర్కి 50 లక్షల పైగా సబ్‌‌‌‌స్క్రయిబర్స్.. అందులో ఒక్క పాటకే 80 మిలియన్ల వ్యూస్‌‌‌‌

ఆమె సంగీత విద్వాంసుల కుటుంబంలో పుట్టింది. సంగీతమే ప్రాణంగా పెరిగింది. మైథిలీ టాలెంట్‌‌‌‌ని గుర్తించిన తండ్రి రమేష్‌‌‌‌ ఆమెను ప్రపంచానికి పరిచయం చేయాలి అనుకున్నాడు. అందుకే మైథిలీకి ఏడేండ్లు ఉన్నప్పుడే సొంతూరి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లాడు. అక్కడ మ్యూజిక్‌‌‌‌ టీచర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తూ.. కూతురిని పోటీలకు సిద్ధం చేశాడు. అలా మొదలైన మైథిలీ సంగీత ప్రయాణం.. యూట్యూబ్‌‌‌‌ వల్ల ప్రపంచపు చివరి అంచుల వరకూ చేరింది. తమ్ముళ్లతో కలిసి పాటలు పాడుతూ ఇప్పటివరకు ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది. 

మైథిలీ ఠాకూర్ (Maithili Thakur) బిహార్‌‌‌‌లోని మధుబని జిల్లాలోని బెనిపట్టిలో 2000లో పుట్టింది. తండ్రి పండిట్‌‌‌‌ రమేష్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ మ్యూజిక్ టీచర్‌‌‌‌‌‌‌‌. వాళ్లది ఒక మారుమూల గ్రామం. అక్కడ రమేష్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ పిల్లలకు సంగీత పాఠాలు నేర్పించేవాడు. తండ్రే కాదు ఆమె తాత కూడా సంగీత విద్వాంసుడే. తాత, నాన్నల ప్రభావం మైథిలీపై చాలా పడింది. అందుకే సంగీతం మీద ఇష్టం పెరిగింది. ఆ ఇష్టమే ఆమెని సోషల్‌‌‌‌ మీడియా ఇన్‌‌‌‌ఫ్లుయెన్సర్‌‌‌‌‌‌‌‌గా మార్చింది.

ఆ జర్నీ ఆమె మాటల్లోనే.. “నా చిన్నప్పుడు మా ఇంట్లో ప్రతి వారం అందరూ కలిసి ఆధ్యాత్మిక పాటలు పాడేవాళ్లు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా సింగర్స్ వచ్చేవాళ్లు. నేను కూడా వాళ్లతో కలిసి పాడేందుకు ప్రయత్నించేదాన్ని. అంటే మాటలతోపాటే పాటలు కూడా నేర్చుకున్నా.

నాకు ఏడేండ్లు ఉన్నప్పుడు నా టాలెంట్‌‌‌‌ చూసి పెద్ద సింగర్ అవుతానని నమ్మారు మా నాన్న. అందుకే ఏ సౌకర్యాలు లేని మా ఊరి నుంచి నన్ను, అమ్మ, తమ్ముళ్లని ఢిల్లీకి తీసుకొచ్చారు. అప్పటివరకు గ్రామీణ ప్రాంతంలో బతికిన మాకు ఢిల్లీలో ఉండడం కొన్నాళ్లు ఇబ్బందిగానే అనిపించింది. పైగా ఖర్చులు బాగా పెరిగిపోయాయి. నన్ను మంచి స్కూల్‌‌‌‌కి పంపడానికి నాన్న దగ్గర డబ్బు లేదు. అందుకే నాకు కొన్ని సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనిచ్చి, ఇంట్లోనే చదువుకోమన్నాడు. నాన్నే రోజూ పాఠాలు చెప్పేవాడు. 

ఆటల కంటే పాటలే ముఖ్యం!

చిన్నప్పుడు అందరు పిల్లల్లాగే నాకూ ఆడుకోవాలని ఉండేది. కానీ.. ఫ్రెండ్స్‌‌‌‌తో కలిసి పార్క్‌‌‌‌కి వెళ్తానంటే నాన్న ‘‘ఇది ఆడుకునే టైం కాదు. నేర్చుకునే టైం. కాబట్టి నువ్వు సంగీతంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలి” అని చెప్పేవారు. ఆ తర్వాత నాకు సంగీతం మీద ఇష్టం ఇంకా పెరిగిపోయింది. నాన్న నాతోపాటు తమ్ముళ్లకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, హార్మోనియం, తబలా వాయించడం నేర్పించారు. 

మొదట్లో ఓటములు

నేను స్కూల్లో ఉన్నప్పుడు 2011లో నాన్న నన్ను ముంబైకి తీసుకెళ్లారు. ఇండియాలోనే ప్రసిద్ధి చెందిన రియాలిటీ టీవీ షో ‘‘లిటిల్ చాంప్స్‌‌‌‌’లో పాల్గొన్నా. కానీ.. టాప్ 20లో ఎలిమినేట్ అయ్యా. 2015లో రియాలిటీ టీవీ షో ‘ఇండియన్ ఐడల్ జూనియర్‌‌‌‌’లో పాల్గొన్నా. కానీ.. మళ్లీ టాప్ 20లోనే ఎలిమినేట్ అయ్యా. చాలా బాధేసింది. 2016లో ‘ఐ జీనియస్ యంగ్ సింగింగ్ స్టార్’షోలో పాల్గొన్నా. ఆ తర్వాత 2017లో ‘రైజింగ్ స్టార్‌‌‌‌’లో పాల్గొన్నా. అందులో లైవ్‌‌‌‌లో పాడడం, లైవ్‌‌‌‌ ఓటింగ్ వల్ల చాలా ఒత్తిడి ఉండేది. కానీ.. నాకు అది చాలా నచ్చింది. నటులు అనిల్ కపూర్, సోనాక్షి సిన్హా లాంటి చాలామంది ప్రముఖులను కలవగలిగా. ఆ షోలో మొదటి రన్నరప్‌‌‌‌గా నిలిచా. 

ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌తో ఎంట్రీ

టీవీ షోల్లో పాల్గొని మళ్లీ ఢిల్లీకి తిరిగి వచ్చినప్పుడు కొన్నాళ్లకు ప్రజలు నన్ను మరచిపోతారేమో అనిపించింది. అందుకే ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌ ద్వారా వాళ్లకు దగ్గరవ్వాలి అనుకున్నా. అదే విషయాన్ని నాన్నకు చెప్పా. ఆయన వెంటనే ఫేస్‌‌‌‌బుక్ పేజీని క్రియేట్‌‌‌‌ చేశారు. అందులో నేను సేకరించి పాడిన జానపద శ్లోకాల వీడియోలు పోస్ట్‌‌‌‌ చేశా. మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో యూట్యూబ్ చానెల్, ఇన్‌‌‌‌స్టాగ్రామ్ అకౌంట్‌‌‌‌ని కూడా క్రియేట్‌‌‌‌ చేశాం. వీడియోల్లో నాతోపాటు నా తమ్ముళ్లు రిషవ్, అయాచి కూడా కనిపిస్తుంటారు. వాళ్లలో ఒకరు తబలా వాయిస్తే.. మరొకరు నాతో  కలిసి పాడుతుంటారు. 

యూట్యూబ్‌‌‌‌తో ఫేమస్‌‌‌‌

మైథిలీ 2018లో తన మొదటి వీడియోతో యూట్యూబ్‌‌‌‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ.. అంతకంటే ముందే 2014లోనే ‘మైథిలీ ఠాకూర్‌‌‌‌‌‌‌‌’పేరుతో చానెల్‌‌‌‌ పెట్టాడు ఆమె తండ్రి రమేష్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌. ఈ చానెల్‌‌‌‌ ద్వారా ఆమె ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది మ్యూజిక్ లవర్స్‌‌‌‌కి చేరువయ్యింది. ముఖ్యంగా శాస్త్రీయ సంగీతం, భక్తి గీతాలు, జానపద గీతాల వీడియోలు బాగా ఆకట్టుకుంటాయి.

హిందీతోపాటు బెంగాలీ, మైథిలీ, ఉర్దూ, మరాఠీ, భోజ్‌‌‌‌పురి, పంజాబీ, తమిళం, ఇంగ్లిష్ భాషల్లో కూడా పాటలు పాడుతుంది. తన మాతృభాష ‘మైథిలీ’లో పాడిన పాటలు ఆమెకు ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చాయి. ఆమె చేసిన మానస్‌‌‌‌పథ్ సిరీస్‌‌‌‌కు ఇప్పటికీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.

యూట్యూబ్‌‌‌‌ ద్వారా ఫేమస్‌‌‌‌ అయ్యాక అంటే 2019 నుంచి మైథిలీ తన తమ్ముళ్లతో కలిసి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సాహిత్య ఉత్సవాల్లో పాల్గొన్నది. ప్రస్తుతం ఆమె చానెల్‌‌‌‌కు 5.04 మిలియన్ల సబ్‌‌‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇప్పటివరకు 1,287 వీడియోలు పోస్ట్ చేసింది. వాటిలో ఆమె పాడిన ‘అయిగిరి నందిని’పాట వీడియోకు ఏకంగా 80 మిలియన్ల వ్యూస్‌‌‌‌ వచ్చాయి.

ఆమె రెండో చానెల్ ‘మైథిలీస్ లైఫ్’ని కూడా 6.8 లక్షల మంది సబ్‌‌‌‌స్క్రయిబ్‌‌‌‌ చేసుకున్నారు. ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లోనూ ఆమె పేజీకి 14 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాదు.. పోయినేడు ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ‘కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు కూడా అందుకుంది మైథిలీ. 

అలా వెలుగులోకి 

ఎనిమిది సంవత్సరాల వయసులో నేను ఒక సంగీత పాఠశాలకు వెళ్ళా. అక్కడికి గవర్నమెంట్‌‌‌‌ స్కూల్‌‌‌‌ నుంచి ఒక వ్యక్తి వచ్చారు. మా నాన్నని ‘మీ పాప ఏ స్కూల్‌‌‌‌లో చదువుతోంది?’అని అడిగారు. నాన్న హోం స్కూలింగ్‌‌‌‌ అని చెప్పడంతో ఆయన గవర్నమెంట్‌‌‌‌ స్కూల్లో చేర్పించమని సలహా ఇచ్చారు. అప్పుడే నాన్న ఒక స్కూల్‌‌‌‌లో చేర్పించారు. అప్పుడే మ్యూజిక్ కాంపిటీషన్‌‌‌‌లో ఒక సోలో పర్ఫార్మెన్స్‌‌‌‌ ఇచ్చా.