బ్రిటన్ ప్రధానికి మోదీ ఫోన్​కాల్​

బ్రిటన్ ప్రధానికి మోదీ ఫోన్​కాల్​

న్యూఢిల్లీ: బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైన కీర్ స్టార్మర్​కు భారత ప్రధాని నరేంద్ర మోదీ  శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో ప్రధాని మోదీ ఫోన్​లో మాట్లాడారు. భారత్​లో పర్యటించాలని ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం ట్వీట్ చేశారు. ‘‘కీర్ స్టార్మర్ తో మాట్లాడటం సంతోషకరంగా ఉంది. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా ఆయనను అభినందించాను.

భారత్, బ్రిటన్ ప్రజల పురోగతి, శ్రేయస్సు కోసం రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం”అని చెప్పారు. ఈ సందర్భంగా పీఎంవో కూడా ఓ ప్రకటన జారీ చేసింది. రెండు దేశాలకు ప్రయోజనకరమైన భారత్– బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్ టీఏ) కొలిక్కి తేవడానికి ఇద్దరు నేతలు అంగీకరించారని తెలిపింది. ఇరుదేశాల మధ్య చారిత్రక సంబంధాలను నేతలు గుర్తు చేసుకున్నారని.. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా నిబద్ధతను చాటినట్టు ప్రకటనలో పేర్కొంది.