
పుట్టిన రోజు పోస్టర్లు చూశాం.. పెళ్లి పోస్టర్లు చూశాం.. చనిపోయిన వాళ్ల పోస్టర్లు చూశాం.. అన్నింటికీ మించి పొలిటికల్ లీడర్ల బ్యానర్లు, పోస్టర్లు కామన్.. ఇది మాత్రం వెరీ వెరీ వెరైటీ.. వైవిధ్యంలోనే వైవిధ్యం.. ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లు వేశాడు.. ఆల్ లైన్ లో బ్యానర్లు వేశాడు.. అది కూడా ఎన్నికల ప్రచారం తరహాలో.. రాజకీయ నేతల స్టిల్స్ లో ఇవి ఉండటం ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళితే..
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని కమ్యూనికేషన్ విభాగంలో కొత్తగా నియమించబడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రతీక్షిత్ కను పాండే ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. కారణం అతను చేసిన ఓ సాహసోపేతమైన చర్యే. ఎక్స్ లో షేర్ చేసిన ఓ పోస్టులో “జనవరి నుండి ప్రారంభమయ్యే UC శాంటా బార్బరా వద్ద కమ్యూనికేషన్ విభాగంలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది" అని అతను క్యాప్షన్ లో రాసుకువచ్చాడు.
ఈ సందర్భంగా షేర్ చేసిన పోస్టర్‌లో.. పాండే మెడలో దండలతో 'విజయం' భంగిమను కలిగి ఉండడం చూడవచ్చు. అతను అక్కడితో ఆగలేదు. విశ్వవిద్యాలయ ప్రముఖులు, మద్దతుదారుల చిత్రాలను సైతం మరాఠీలో అభినందన సందేశాలతో పూర్తి చేశాడు. ఈ ఆశ్చర్యకరమైన, హాస్యభరితమైన పోస్టుకు నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. “మిమ్మల్ని అభినందించాలో లేదంటే మీకు ఓటు వేయాలో నాకు తెలియట్లేదు.. బిగ్ ఫ్యాన్ ” అని ఓ యూజర్ రాసుకువచ్చారు. "ఇది నేను చూసే కొద్దీ ఇది మరింత హాస్యాస్పదంగా ఉంది" అంటూ ఇంకొందరు కామెంట్ చేశారు.