బషీర్బాగ్, వెలుగు: జైళ్లలో ఖైదీలకు స్వేచ్ఛగా తిరిగే చట్టబద్ధమైన హక్కును కల్పించాలని, ఇందుకోసం చర్లపల్లి జైలులో మావోయిస్టు నేత సంజయ్ దీపక్ రావు నిరాహారదీక్ష చేస్తున్నారని భారత ప్రజా న్యాయవాదుల సంఘం తెలిపింది. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సంఘం ఉపాధ్యక్షుడు వెంకన్న, సంయుక్త కార్యదర్శి సురేశ్, దీపక్ రావు భార్య సరస్వతి మాట్లాడారు.
రెండేండ్ల కింద అరెస్ట్ అయిన సంజయ్ దీపక్ రావు చర్లపల్లి జైలులో చీకటి సెల్ లో ఒంటరిగా ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీపక్ రావును ఎవరితో మాట్లాడనివ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. స్వేచ్ఛ కోసం దీపక్ రావు నిరాహారదీక్ష చేపట్టారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని , ఖైదీలకు స్వేచ్ఛగా ఉండే వాతావరణం కల్పించాలని కోరారు.
