రైల్లో అమ్మ.. ఫోన్​ కలవలే!

రైల్లో అమ్మ.. ఫోన్​ కలవలే!
  • ట్విట్టర్​ ద్వారా రైల్వేకు చెప్పిన కొడుకు
  • వెంటనే స్పందించి మాట్లాడించిన సంస్థ

ఇండియన్‌ రైల్వే నెటిజన్ల మనసు గెలుచుకుంది. ట్రైన్లో వస్తున్న అమ్మకు ఫోన్‌ కలవట్లేదని, కాంటాక్ట్‌ చేయలేకపోతున్నాని ట్విట్టర్‌ ద్వారా రైల్వే సాయం కోరిన ఓ యువకుడికి రిప్లై ఇవ్వడమే కాకుండా సాయం చేసి ‘ఔరా’ అనిపించుకుంది. సోమవారం సశ్వత్‌ అనే వ్యక్తి తన తల్లి అజ్మీర్‌, సియాద్దా ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లో వస్తోందని, ఆ ట్రైన్‌ 12 గంటలు లేటుగా నడుస్తోందని, ఎంత ట్రై చేసినా అమ్మకు ఫోన్‌ కలవట్లేదని ట్విట్టర్‌లో రాసి రైల్వేను, మంత్రి పీయూష్‌ గోయల్‌ను ట్యాగ్‌ చేశారు. అతని ట్వీట్‌కు రైల్వే సేవా స్పందించి తన తల్లి పీఎన్‌ఆర్‌ నంబరు, ఫోన్‌ నంబర్‌ అడిగింది. ఏరోజు ట్రైన్‌ ఎక్కారో, ఎక్కడ ఎక్కారో కూడా వివరాలు కోరింది. తర్వాత పశ్చిమ బెంగాల్‌ అసన్‌సోల్‌ డీఆర్‌ఎంను అలర్ట్‌ చేసింది. ఆయన ట్రైన్‌లోని టికెట్‌ చెకర్‌ను అలర్ట్‌ చేశారు. అతని ద్వారా సశ్వత్‌ తల్లితో ఫోన్‌లో మాట్లాడించారు. సశ్వత్‌ తల్లితో మాట్లాడుతున్నాడని అసన్‌సోల్‌ డీఆర్‌ఎం ఆ తర్వాత ట్వీట్‌ చేశారు. సశ్వత్‌ కూడా మరోసారి ట్వీట్‌ చేశారు. తల్లితో మాట్లాడానని, రైల్వే స్పందించిన తీరు బాగుందని తెలిపారు. కృతజ్ఞతలు కూడా చెప్పారు. సరైన టైంకు స్పందించిన రైల్వేను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు.