Indian Railway: పండుగల వేళ..సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

Indian Railway: పండుగల వేళ..సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

న్యూఢిల్లీ:ఇండియన్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే నెలల్లో పండుగలు ఉన్నందున ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. పండుగ సీజన్ లో లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి భారతీయ రైల్వే 150 పూజ ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది. ఈ రైళ్లు సెప్టెంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా ప్రధాన మార్గాలను కవర్ చేస్తాయి.మొత్తం 2,024 ట్రిప్పులను ప్లాన్ చేసింది ఇండియన్ రైల్వే శాఖ. 

సౌత్ సెంట్రల్ జోన్(SCR) లోనే అత్యధికం.. 

పండుగల సీజన్ లో అత్యధిక సంఖ్యలో రైళ్లను నడుపుతుంది దక్షిణ మధ్య రైల్వే (SCR).ఈ జోన్ లో - మొత్తం 48 రైళ్లు 684 ట్రిప్పులను ప్లాన్ చేశారు. అదనపు రైళ్ల ఏర్పాటుతో దక్షిణ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే మూడు కేంద్రాలు హైదరాబాద్, సికింద్రాబాద్ ,విజయవాడ నుంచి ప్రయాణీకులకు ప్రయాణ ఇబ్బందులు తప్పుతాయని భావిస్తున్నారు.

ఏ జోన్ నుంచి ఎన్ని రైళ్లు ..

  • దక్షిణ మధ్య రైల్వే (SCR)- 48 రైళ్లు (హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ మార్గాలు)
  • తూర్పు మధ్య రైల్వే (ECR)- 14 రైళ్లు (పాట్నా, గయా, దర్భంగా, ముజఫర్‌పూర్ మార్గాలు)
  • తూర్పు రైల్వే (ER)- 24 రైళ్లు (కోల్‌కతా, సీల్దా, హౌరా మార్గాలు)
  • పశ్చిమ రైల్వే (WR)- 24 రైళ్లు (ముంబై, సూరత్, వడోదర మార్గాలు)
  • దక్షిణ రైల్వే (SR)- 10 రైళ్లు (చెన్నై, కోయంబత్తూర్, మధురై మార్గాలు- 66 ట్రిప్పులు)

అదనంగా భువనేశ్వర్, పూరి, సంబల్పూర్ (ఈస్ట్ కోస్ట్ రైల్వే), రాంచీ, టాటానగర్ (సౌత్ ఈస్టర్న్ రైల్వే), ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ (నార్త్ సెంట్రల్ రైల్వే), బిలాస్‌పూర్, రాయ్‌పూర్, భోపాల్, కోటా నుంచి ప్రత్యేక సర్వీసులు నడుస్తాయి.

త్వరలో మరిన్ని రైళ్లు వచ్చే అవకాశం ..

 గతంలో పండుగల సమయంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి రైల్వేలు 12వేలట్రిప్పులకు పైగా ప్రత్యేక రైళ్లను నడిపారు. అయితే కేవలం మొదటి దశ ప్రకటన మాత్రమేనని భారత రైల్వే స్పష్టం చేసింది.రాబోయే వారాల్లో మరిన్ని రైళ్లను ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ముంబై, చెన్నై ,కోల్‌కతా వంటి మెట్రోల నగరాల నుంచి పాట్నా, దర్భంగా ,ముజఫర్‌పూర్ వంటి పండుగ కేంద్రాల వరకు, ప్రయాణీకులు దీపావళి, ఛత్ పూజ ,దుర్గా పూజలను వారి కుటుంబాలతో జరుపుకునేలా, పండుగ ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు భారతీయ రైల్వే రెడీ అవుతోంది.