- ఇంట్రాడేలో 91.74 వరకు పతనం
- ఈ నెలలో ఇప్పటివరకు 1.5 శాతం డౌన్
- ఆర్‌బీఐ జోక్యం చేసుకున్నా కనిపించని ఫలితం
- యూరప్‌తో ట్రంప్ గొడవ పెట్టుకోవడమే కారణం
- సెన్సెక్స్ 271 పాయింట్లు డౌన్
ముంబై: కొత్త సంవత్సరంలో స్టాక్ మార్కెట్లే కాదు రూపాయి పతనం కూడా ఆగడం లేదు. డాలర్‌తో రూపాయి విలువ బుధవారం ఇంట్రాడేలో 77 పైసలు క్షీణించి 91.74 వద్ద జీవిత కాల కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 68 పైసల లాస్‌తో 91.65 వద్ద ముగిసింది. ఇది నవంబర్ 2025 తర్వాతి అతిపెద్ద ఒకరోజు పతనం. డిసెంబర్ 16, 2025లో 91.14 వద్ద కనిష్ట స్థాయిని తాకిన రూపాయి, ఈ నెలలో ఇప్పటివరకు 1.5శాతం పడిపోయింది.
‘‘గ్రీన్‌లాండ్ వివాదం, యూరప్‌పై కొత్త టారిఫ్ బెదిరింపులు, వెనెజువెలా ఆయిల్ రిజర్వులపై అమెరికా నియంత్రణ వంటి జియోపొలిటికల్ ఉద్రిక్తతలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెగెటివ్ మూడ్ కనిపిస్తోంది. ఈ ఎఫెక్ట్ మన మార్కెట్లపై కూడా పడుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు భారీగా ఫండ్స్‌ను విత్‌డ్రా చేసుకుంటున్నారు”అని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ఆర్‌బీఐ జోక్యంతో తాత్కాలికంగా ఉపశమనం దొరికినా, రూపాయి పతనం ఆగడం లేదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ విశ్లేషకుడు దిలీప్ పర్మార్ తెలిపారు. విదేశీ నిధులు వెళ్లిపోవడం, నాటో విభేదాల ప్రమాదం, అమెరికా–యూరప్ ఉద్రిక్తతలు గ్లోబల్ ట్రేడ్‌పై ప్రభావం చూపుతున్నాయని కోటక్ మహీంద్ర ఏఎంసీ ఎనలిస్ట్ అభిషేక్ బిసెన్ వివరించారు.
అయితే, ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే పెట్టుబడిదారుల నమ్మకం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఆర్‌బీఐ వద్ద భారీగా ఫారెక్స్ రిజర్వులు (687 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ (ఆర్‌ఈఈఆర్) ను బట్టి రూపాయి చవకగా ఉంది. ఒక దేశపు వస్తువులు, సేవలు ఇతర దేశాలతో పోలిస్తే ఎంత ఖరీదుగా లేదా చవకగా ఉన్నాయో ఆర్‌ఈఈఆర్ ద్వారా తెలుస్తుంది. దీంతో ఎగుమతులకు మద్దతు లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మేజర్ కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువను కొలిచే డాలర్ ఇండెక్స్ 98.61 వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్ క్రూడ్ 1.88శాతం పడిపోయి బ్యారెల్‌కి 63.70 డాలర్ల వద్ద ఉంది. దేశీయ మార్కెట్లలో సెన్సెక్స్ బుధవారం 270 పాయింట్లు పడిపోయి 81,909 వద్ద, నిఫ్టీ 75 పాయింట్లు తగ్గి 25,157 వద్ద ముగిశాయి. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు మంగళవారం నికరంగా రూ.2,938 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, బుధవారం మరో రూ.1,790 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.
బంగారం, వెండి జూమ్..
బంగారం, వెండి ధరలు ఇప్పటిలో ఆగేటట్టు కనిపించడం లేదు. కేజీ వెండి ధర బుధవారం మరో రూ.5 వేలు పెరిగి హైదరాబాద్‌లో రూ.3.45 లక్షలకు చేరింది. బంగారం ధర 10 గ్రాములకు (24 క్యారెట్లకు) రూ.6,820 పెరిగి రూ.1,56,600 పలుకుతోంది. ఢిల్లీలో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.6,500 పెరిగి రూ.1,59,700 కు, కేజీ వెండి ధర రూ.11,300 పెరిగి రూ.3.34 లక్షలకు చేరింది. ఈ ఏడాది చివరి నాటికి గోల్డ్ ధర రూ.1,95,000, వెండి రూ.4,60,000 వరకు వెళ్లొచ్చని గ్లోబల్‌డేటా సంస్థ అంచనావేసింది.
గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి రూ.11,600 కోట్లు
దేశీయ ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్‌లలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కిందటేడాది డిసెంబర్‌లో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) లోకి నికరంగా రూ.11,600 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా (యాంఫీ) తెలిపింది. ఈటీఎఫ్‌ల ద్వారా ఇన్వెస్టర్లు హోల్డ్ చేస్తున్న బంగారం డిసెంబర్‌లో 8.6 టన్నులు పెరిగిందని, మొత్తం హోల్డింగ్ విలువ 95 టన్నులకు చేరిందని యాంఫీ డేటాను కోట్ చేస్తూ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీఎస్) వివరించింది. 2025లో ఆర్‌బీఐ సుమారు 57.5 టన్నులు గోల్డ్ కొనుగోలు చేయగా, ఈ నెలలో ఇప్పటివరకు 4.02 టన్నులు కొన్నది. దీంతో మొత్తం రిజర్వులు 880 టన్నులకు చేరాయి.
