లక్ష్యసేన్‌‌ ఔట్‌‌..ముగిసిన ఇండియా పోరాటం

లక్ష్యసేన్‌‌ ఔట్‌‌..ముగిసిన ఇండియా పోరాటం
  •     ఆల్‌‌ ఇంగ్లండ్‌‌లో ముగిసిన ఇండియా పోరాటం

బర్మింగ్‌‌హామ్‌‌ : ఆల్‌‌ ఇంగ్లండ్‌‌ ఓపెన్‌‌ బ్యాడ్మింటన్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా షట్లర్ల పోరాటం ముగిసింది. బరిలో ఉన్న ఏకైక ప్లేయర్‌‌ లక్ష్యసేన్‌‌ కూడా సెమీస్‌‌లోనే ఇంటిముఖం పట్టాడు. శనివారం జరిగిన మెన్స్ సింగిల్స్‌‌ సెమీస్‌‌లో లక్ష్య 12–21, 21–10, 15–21తో జొనాథన్‌‌ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. గంటా 8 నిమిషాల మ్యాచ్‌‌లో తొలి గేమ్‌‌ చేజారినా రెండో గేమ్‌‌లో ఇండియన్‌‌ ప్లేయర్‌‌ అద్భుతంగా పుంజుకున్నాడు. తన ట్రేడ్‌‌ మార్క్‌‌ షాట్లతో వరుసగా పాయింట్లతో హోరెత్తించాడు. స్కోరు 2–2తో సమమైన తర్వాత లక్ష్య వరుసగా 8, 7 పాయింట్లు నెగ్గి స్పష్టమైన ఆధిక్యంలో నిలిచాడు.

ఈ దశలో క్రిస్టీ ఒక్కో పాయింట్‌‌తో ముందుకొచ్చినా..  సేన్‌‌ జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయాడు. స్కోరు 19–10 వద్ద లక్ష్యసేన్‌‌ వరుసగా రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌‌ను సొంతం చేసుకున్నాడు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌‌లో ఇద్దరు హోరాహోరీగా తలపడటంతో స్కోరు 8–8తో సమమైంది. కానీ ఇక్కడి నుంచి లక్ష్యసేన్‌‌ ఆట గాడి తప్పింది. క్రిస్టీ బలమైన క్రాస్‌‌ కోర్టు ర్యాలీలతో వరుసగా పాయింట్లు సాధించి లీడ్‌‌లోకి వచ్చాడు. దీంతో ఒత్తిడికి లోనైన లక్ష్య ఒకటి, రెండు పాయింట్లకే పరిమితమయ్యాడు.

చివరకు 15–12 స్కోరు వద్ద క్రిస్టీ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి ఆధిక్యాన్ని 20–12కు పెంచుకున్నాడు. ఈ టైమ్‌‌లో లక్ష్యసేన మూడు డ్రాప్స్‌‌తో పాయింట్లు గెలిచి ఆశలు రేపాడు. కానీ, అతని రిటర్న్‌‌ నెట్‌‌కు తగలడంతో క్రిస్టీ గేమ్‌‌తో పాటు మ్యాచ్‌‌ను చేజిక్కించుకున్నాడు. అంతకుముందు జరిగిన క్వార్టర్‌‌ఫైనల్లో లక్ష్యసేన్‌‌ 20–22, 21–16, 21–19తో లీ జి జియా (మలేసియా)పై నెగ్గి సెమీస్‌‌ చేరాడు.