పాక్‌‌ వ్యక్తిని పెళ్లాడిన ఇండియన్ సిక్కు మహిళ.. లాహోర్‌‌‌‌లో దంపతుల అరెస్ట్‌‌..

పాక్‌‌ వ్యక్తిని పెళ్లాడిన ఇండియన్ సిక్కు మహిళ.. లాహోర్‌‌‌‌లో దంపతుల అరెస్ట్‌‌..
  •     షెల్టర్‌‌‌‌ హోమ్‌‌కు మహిళ తరలింపు

లాహోర్‌‌‌‌: గతేడాది పాకిస్తాన్‌‌ పర్యటనకు వెళ్లిన ఓ ఇండియన్‌‌ సిక్కు మహిళా.. అక్కడే ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. గతేడాది నవంబర్‌‌‌‌లో 2,000 మంది సిక్కు పర్యాటకులు వాఘా బార్డర్‌‌‌‌ గుండా పాక్​లో అడుగుపెట్టారు. వీరిలో సరబ్‌‌జిత్‌‌ కౌర్‌‌‌‌(48) అనే మహిళా కూడా ఉంది. వీరు గురునానక్‌‌ జయంతి సందర్భంగా అక్కడున్న గురునానక్‌‌ పర్యాటక ప్రాంతాలను దర్శించుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత పర్యాటకులందరూ తిరిగి ఇండియాకు రాగా, సరబ్‌‌జిత్‌‌ కౌర్‌‌‌‌ మాత్రం కనిపించకుండా పోయింది. 

నవంబర్‌‌‌‌ 4న ఆమె పాకిస్తాన్‌‌కు రాగా, ఆ మరుసటి రోజు లహోర్‌‌‌‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న షేక్‌‌పురా జిల్లాకు చెందిన నాసిర్‌‌‌‌ హుస్సేన్‌‌ను పెళ్లి చేసుకుంది. అయితే, ఈ విషయం స్థానిక పోలీసులకు తెలియడంతో మీ పెళ్లి రద్దు చేసుకోవాలని పోలీసులు వేధించడం మొదలు పెట్టారు. దీంతో కౌర్‌‌‌‌ దంపతులు లాహోర్‌‌‌‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆ జంటను వేధించడం ఆపాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అయితే, కోర్టు ఆదేశాలను పోలీసులు లెక్క చేయకపోగా, సరబ్‌‌జిత్‌‌ కౌర్‌‌‌‌ను అరెస్ట్ చేసి, లాహోర్‌‌‌‌లోని షెల్టర్‌‌‌‌ హోమ్‌‌కు తరలించారు. 

ఆమె భర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అంతకుముందే ఆమెను ఇండియాకు డిపోర్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, వాఘ్‌‌ బార్డర్‌‌‌‌ వద్ద కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదు. కాగా, అంతకుముందే ఆమె పాకిస్తాన్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంది. గతంలో తనకు పెళ్లయిందని, విడాకులు అయ్యాయని ఇటీవల ఒక వీడియో రిలీజ్‌‌ చేసింది. హుస్సేన్‌‌ను పెళ్లి చేసుకునేందుకు తాను ఇక్కడికి వచ్చానని వెల్లడించింది.