మరో చరిత్రాత్మక  ఘట్టానికి సిద్ధమైన ఇస్రో

 మరో చరిత్రాత్మక  ఘట్టానికి సిద్ధమైన ఇస్రో

​​​​​​చెన్నై: ఇండియన్​ స్పేస్​ రీసెర్చ్​ ఆర్గనైజేషన్(ఇస్రో) మరో చరిత్రాత్మక ఘట్టానికి సిద్ధమవుతోంది. తన తొలి స్మాల్​ శాటిలైట్​ లాంచ్​ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ) మిషన్​కు అన్ని ఏర్పాట్లను ఇస్రో పూర్తి చేసింది. ఆదివారం శ్రీహరికోటలోని స్పేస్​ పోర్ట్​ నుంచి ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్.. ​ఎర్త్​అబ్జర్వేషన్​ శాటిలైట్(ఈవోఎస్) 2 శాటిలైట్​తో పాటు స్టూడెంట్లు రూపొందించిన ఆజాదీశాట్​ను నింగిలోకి మోసుకుపోనుంది. ఈ ప్రయోగం 13 నిమిషాల్లోనే పూర్తవుతుంది.

ఎస్ఎస్ఎల్వీలో ఇదే తొలి మిషన్

పోలార్​ శాటిలైట్​ లాంచ్​ వెహికల్స్(పీఎస్ఎల్వీ), జియోసింక్రోనస్​ లాంచ్​ వెహికల్(జీఎస్ఎల్వీ)లతో ఎన్నో విజయవంతమైన మిషన్లను పూర్తి చేసిన ఇస్రో ఇప్పుడు తన తొలి ఎస్ఎస్ఎల్వీ ప్రయోగానికి రెడీ అయ్యింది. ఎస్ఎస్ఎల్వీల ద్వారా శాటిలైట్లను భూమి లోయర్​ ఆర్బిట్​లోకి ప్రవేశపెడుతుంది. గత కొద్ది వారాలుగా శాస్త్రవేత్తలు స్మాల్​ లాంచ్​ వెహికల్స్​ను అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉన్నారు. చిన్న శాటిలైట్లకు డిమాండ్​ ఎక్కువగా ఉండటంతో ఆ దిశగా ఇస్రో అడుగులు వేస్తోంది. ఈ శాటిలైట్ల బరువు 500 కేజీల వరకు ఉంటుంది. వీటిని 500 కిలోమీటర్ల దూరంలోని లోయర్​ ఆర్బిట్​లో ప్రవేశపెడతారు. ఎస్ఎస్ఎల్వీ ప్రయోగానికి 5 గంటల కౌంట్​డౌన్​ మాత్రమే ఉంటుందని ఇస్రో సైంటిస్టులు తెలిపారు. ఆదివారం ఉదయం 4.18 గంటలకు కౌంట్​డౌన్​ మొదలవుతుంది. 9.18 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్​ ధావన్​ స్పేస్​ సెంటర్​లోని ఫస్ట్​ లాంచ్​ప్యాడ్​ నుంచి ఎస్ఎస్ఎల్వీ నింగిలోకి వెళుతుంది.