- ఏఐ కంపెనీలు లేకపోవడం, ఆర్థిక వ్యవస్థ మందగించడమే కారణం
- ఈ ఏడాదిలో ఇప్పటివరకు 8 శాతం డౌన్
- ఆసియాలో జపాన్, తైవాన్ మార్కెట్లకు మొగ్గు చూపుతున్న విదేశీ ఇన్వెస్టర్లు
- బ్యాంక్ ఆఫ్ అమెరికా రిపోర్ట్ వెల్లడి
ముంబై: ఇండియా స్టాక్ మార్కెట్ ఈ ఏడాది నిరాశపరిచింది. గత పదేళ్లుగా లాభాల్లో ముగిసిన నిఫ్టీ–50, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 8 శాతం నష్టపోయింది. ఇరాన్–అమెరికా యుద్ధం, ఆయిల్ ధరలు పెరగడంతో మన ఆర్థిక వ్యవస్థ మందగించింది.
సరైన ఏఐ కంపెనీలు లేకపోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు ఇటువైపు చూడడం లేదు. గ్లోబల్ బ్రోకరేజ్ కంపెనీ బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఎఫ్‌ఏ) సర్వే ప్రకారం, 32 శాతం మంది ఫండ్ మేనేజర్లు ఇండియా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడడం లేదు. జులై సర్వేలో ఈ నెంబర్ 27 శాతానికి తగ్గినా, పెద్ద ఇన్వెస్లర్లకు మన మార్కెట్‌పై ఆసక్తి లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఆసియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తైవాన్, జపాన్, సౌత్ కొరియా, చైనా మార్కెట్ల వైపు చూస్తున్నారు. లిస్ట్‌లో చివరిలో ఉండే ఇండోనేషియా కంటే మన మార్కెట్ తక్కువ ఆదరణ పొందింది. విదేశీ నిధులు పొందిన మార్కెట్లలో రెండో వరస్ట్ మార్కెట్‌గా నిలిచింది.
ఎందుకంటే?
ఆసియాలో నాలుగో అతిపెద్ద ఈక్విటీ మార్కెట్ అయిన భారత్‌కు దాదాపు 32 శాతం మంది ఫండ్ మేనేజర్లు ‘అండర్‌వెయిట్’ రేటింగ్ ఇచ్చారు. అంటే భవిష్యత్‌లో మన మార్కెట్ ఇతర మార్కెట్లతో పోలిస్తే తక్కువ రిటర్న్ ఇస్తుందని నమ్ముతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు.
1) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) లోటు:
గ్లోబల్‌గా చూస్తే పెద్ద ఏఐ కంపెనీలున్న మార్కెట్లు ఈ ఏడాది ర్యాలీ చేశాయి. చిప్‌ల తయారీ కంపెనీలు శామ్‌సంగ్, హైనిక్స్ షేర్లు దూసుకుపోవడంతో సౌత్ కొరియా కొస్పీ ఈ ఏడాది 100 శాతం ఎగిసింది. టీఎస్‌ఎంసీలోకి భారీగా పెట్టుబడులు రావడంతో తైవాన్ తైఎక్స్ 60 శాతం వరకు, సెమీకండక్టర్ సెక్టార్‌లో ముందుండడంతో జపాన్ నికాయ్ 225 ఇండెక్స్ 39 శాతం పెరిగింది. ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్‌వల్ల అమెరికా నాస్‌డాక్ 20 శాతం రిటర్న్ ఇచ్చింది. ఇండియా నుంచి ఈ ఏడాది రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వెళ్లిపోయాయి.
2) ఆర్థిక వృద్ధి మందగమనం
దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. ఇరాన్ యుద్ధం వల్ల బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 90 డాలర్ల పైకి చేరింది. దీని ఎఫెక్ట్ క్లియర్‌గా కనిపిస్తోంది. రిటైల్ ఇన్‌ఫ్లేషన్ మార్చిలోని 4.85 శాతం నుంచి జులై నాటికి 5.55 శాతానికి పెరిగింది. గ్రామాలు, పట్టణాల్లో డిమాండ్ పడిపోయింది. కొనుగోళ్లు తగ్గాయి. మరోవైపు ఫండ్ మేనేజర్లు మన స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్స్ ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.
మంచి ఫలితాలున్నా తప్పని నష్టాలు..
కంపెనీల జూన్ క్వార్టర్ ఫలితాలు అంచనాలను మించి రాణించినప్పటికీ మార్కెట్లలో ఒత్తిడి కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 కంపెనీల లాభాలు ఏడాది లెక్కన 18 శాతం వృద్ధి నమోదు చేసినప్పటికీ, గత రెండు వారాలుగా మార్కెట్లు నష్టపోతున్నాయి. ప్రస్తుత క్వార్టర్ (జులై–సెప్టెంబర్) లో విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటివరకు 4 బిలియన్ డాలర్ల (దాదాపు 38 వేల కోట్ల) కు పైగా పెట్టుబడులు పెట్టినప్పటికీ, ఈ ఏడాది మొత్తంగా నిఫ్టీ 8 శాతం నష్టంతో ఆసియాలోనే రెండో అత్యంత పేలవమైన మార్కెట్‌గా నమోదైంది.
