
- తాజా ర్యాలీతో ఫ్రాన్స్‌ను దాటిన మార్కెట్
- మొదటి ప్లేస్‌లో యూఎస్, సెకెండ్ ప్లేస్‌లో చైనా
- రానున్న రోజుల్లో మరింత ముందుకు
బిజినెస్ డెస్క్, వెలుగు: గత నెలన్నర రోజుల నుంచి ర్యాలీ చేస్తున్న దేశ స్టాక్ మార్కెట్, గ్లోబల్‌గా ఐదో అతిపెద్ద మార్కెట్ ర్యాంక్‌ను తిరిగి అందుకుంది. ఈ ఏడాది జనవరిలో తన ప్లేస్‌ను ఫ్రాన్స్‌కు కోల్పోయిన ఇండియా, తాజాగా గాడిలో పడింది. ఈ ఏడాది మార్చి 28 నుంచి దేశ స్టాక్ మార్కెట్ ర్యాలీ చేస్తోంది. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్లు పెరగడం, మాక్రో ఎకనామిక్ పరిస్థితులు మెరుగవ్వడంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీగా లాభపడ్డాయి. మార్చి 28 తర్వాత నుంచి ఈ ఇండెక్స్‌లు 10 శాతం చొప్పున లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు ఇదే టైమ్‌లో ఏకంగా 15 శాతం ర్యాలీ చేశాయి. బ్యాంకింగ్ షేర్లు మార్కెట్ ర్యాలీని నడిపించాయి. బీఎస్‌ఈ బ్యాంకెక్స్ ఏకంగా 13 శాతం పెరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు గత రెండు నెలల్లోనే నికరంగా 6.3 బిలియన్ డాలర్ల (రూ.51 వేల కోట్ల) ను ఇన్వెస్ట్ చేశారు.
రూ.271 లక్షల కోట్లకు మార్కెట్ వాల్యుయేషన్..
దేశ స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్ 3.31 ట్రిలియన్ డాలర్లు (రూ.271 లక్షల కోట్లు) గా ఉంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన మార్కెట్లలో ఇండియా ఐదో ప్లేస్‌లో కొనసాగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బీఎస్‌ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ 330 బిలియన్ డాలర్లు పెరిగింది. టాప్ పొజిషన్‌లో యూఎస్ స్టాక్ మార్కెట్ కొనసాగుతోంది. ఈ దేశ మార్కెట్ క్యాపిటలైజేషన్ 44.54 ట్రిలియన్ డాలర్లు (రూ.3,652 లక్షల కోట్లు). 10.26 ట్రిలియన్ డాలర్ల (రూ.841 లక్షల కోట్ల) తో చైనా సెకెండ్ ప్లేస్‌లో, 5.68 ట్రిలియన్ డాలర్లతో జపాన్ మూడో ప్లేస్‌లో ఉన్నాయి. నాల్గో ప్లేస్‌లో ఉన్న హాంకాంగ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.14 ట్రిలియన్ డాలర్లు. 3.24 ట్రిలియన్ డాలర్లతో మొన్నటి వరకు ఐదో ప్లేస్‌లో కొనసాగిన ఫ్రాన్స్ స్టాక్ మార్కెట్‌ను ఇండియా అధిగమించింది.
మార్కెట్ మూడో సెషన్‌లోనూ అప్..
బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాల్లో కదిలాయి. మెటల్, రియల్టీ, ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సెన్సెక్స్ 345 పాయింట్లు (0.55 శాతం) లాభపడి 62,846 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 99 పాయింట్లు ఎగిసి 18,599 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్‌లు పాజిటివ్‌గా ట్రేడవ్వడంతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సోమవారం లాభాల్లో ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ ఇంట్రాడేలో 18,650 వరకు వెళ్లింది. ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ మినహా మిగిలిన ఇండెక్స్‌లు గ్రీన్‌లో క్లోజయ్యాయి.
ఎనలిస్టులు ఏమంటున్నారంటే?
‘గ్లోబల్ మార్కెట్‌లు పాజిటివ్‌గా కదలడంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడయ్యాయి. టెక్నికల్‌గా చూస్తే, మార్కెట్ గ్యాప్ అప్‌లో ఓపెనై, ఇంట్రాడేలో 18,585 – 18,640 రేంజ్‌లో ట్రేడయ్యింది’ అని కోటక్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. డైలీ చార్ట్‌లో చిన్న క్యాండిల్ ఏర్పడడం చూస్తుంటే మార్కెట్‌లో బుల్స్, బేర్స్ ఎవరూ స్ట్రాంగ్‌గా లేరని తెలుస్తోందన్నారు. మార్కెట్ బుల్లిష్‌గా ఉందని, కానీ, ట్రేడర్లు ఇంట్రాడే కనిష్టాల దగ్గర కొని, గరిష్టాల దగ్గర అమ్ముకోవడానికి ప్రయత్నించాలని వెల్లడించారు. నిఫ్టీకి 18,550, 18,500 లెవెల్స్ కీలక సపోర్ట్‌గా పనిచేస్తాయి. 18,650, 18,700 లెవెల్స్‌లో రెసిస్టెన్స్ ఉండొచ్చు. 18,500 కిందకి వస్తే ట్రేడర్లు తమ లాంగ్ పొజిషన్ల నుంచి ఎగ్జిట్ అవ్వడం మంచిది’ అని సలహా ఇచ్చారు. యూఎస్‌లో డెట్ సీలింగ్‌పై చర్చలు చివరి దశకు చేరుకోవడంతో గ్లోబల్ మార్కెట్‌లు పాజిటివ్‌గా కదులుతున్నాయని మోతీలాల్ ఓస్వాల్ ఎనలిస్ట్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. నిఫ్టీ బ్యాంక్ 44,483 లెవెల్ దగ్గర కొత్త రికార్డ్‌ను టచ్ చేసిందని, అన్ని సెక్టార్ల ఇండెక్స్‌లు పాజిటివ్‌గా క్లోజయ్యాయని వెల్లడించారు. గ్లోబల్ మార్కెట్‌లు పాజిటివ్‌గా కదలడం, విదేశీ ఇన్వెస్టర్లు నెట్ బయ్యర్లుగా మారడంతో నిఫ్టీ రికార్డ్ లెవెల్‌కు చేరుకుంటుందని అన్నారు.
లక్ష పాయింట్లకు సెన్సెక్స్..
దేశ మార్కెట్‌లు మరింతగా పెరుగుతాయని ఫారిన్ బ్రోకరేజి జెఫరీస్ నమ్ముతోంది. బెంచ్‌మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ లక్ష పాయింట్లకు చేరడం ఎంతో దూరంలో లేదని వెల్లడించింది. ఈ ఇండెక్స్ సోమవారం 62,846 దగ్గర ముగిసింది. ఇన్వెస్టర్లు క్యూ4 జీడీపీ డేటాపై ఫోకస్ పెట్టారు.
ఈ నెల 31 న డేటా వెలువడనుండగా, దేశ ఆర్థిక వ్యవస్థపై ఒక క్లారిటీ రానుంది.