
Indo-Pak conflict: నిన్నటి నుంచి ఆపరేషన్ సిందూర్ రెండవ దశ స్టార్ట్ కావటంతో నేడు భారత స్టాక్ మార్కెట్లు నష్టాలతో తమ ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి. అయితే పాక్ ఇండియాపై కసి తీర్చుకునేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలం కావటంతో బోర్డర్లో పరిస్థితులు దాదాపుగా ఇండియా కంట్రోల్ లోనే ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఇండియా పైచేయి కలిగి ఉండటం భారతీయ స్టాక్ మార్కెట్లపై భారీగా ప్రభావాన్ని చూపలేకపోయాయని, అందుకే ఇన్వెస్టర్లలో ఆందోళనలు తక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా ఇలాంటి యుద్ధ వాతావరణం అలుముకున్న రోజుల్లో స్టాక్ మార్కెట్లు భారీగా పతనాన్ని నమోదు చేస్తుంటాయి. అయితే ప్రస్తుతం మాత్రం భారత మార్కెట్లలో అంత స్థాయిలో ప్రభావం కనిపించకపోవటానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి ఇప్పటి వరకు జరిగిన అన్ని పరిణామాల్లో భారత్ పూర్తిగా పైచేయి సాధించటం కాగా రెండవది పరిస్థితులు ముదురుతున్న కొద్ది పాకిస్థానుకు భారీగా నష్టం పెరగటం. అలాగే ప్రపంచ స్థాయిలో కూడా భారత చర్యలకు మద్ధతు లభించటం కలిసొస్తోంది.
ఇదే క్రమంలో చైనా, అమెరికా ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం భారతదేశానికి కలిసొస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇప్పటికే ఈ ఏడాది జీడీపీ వృద్ధి గణాంకాలు మెరుగ్గా ఉన్నట్లు అంచనాలు చెప్పటం, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి భారత స్టాక్ మార్కెట్లలోకి తమ డబ్బును తీసుకురావటం మద్దతును ఇస్తున్నాయి. ఈ క్రమంలో తగ్గుతున్న మార్కెట్లను కొత్త పెట్టుబడి అవకాశాలుగా వినియోగించుకోవాలని, ఇన్వెస్టర్లు అస్సలు భయపడొద్దని సీనియర్ ఇన్వెస్టర్లు చెబుతున్నారు. అయితే కొనసాగుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ముందుకు సాగాలని వారు సూచిస్తున్నారు.
నిపుణుల మాట ఇదే..
ప్రస్తుతం పరిస్థితుల్లో హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రైమ్ రీసెర్చ్ హెడ్ దేవర్ష్ వకీల్ ఇన్వెస్టర్లతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇన్వెస్టర్లు ఆందోళన చెందటానికి బదులుగా ముందస్తుగా అప్రమత్తంగా ఉండటం ముఖ్యమని అన్నారు. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు షార్ట్ టర్మ్ ఎక్స్పోజర్ నష్టాలను హెచ్డ్ చేసుకునేందుకు డెరివేటివ్స్ ఉపయోగించుకోవాలని వారు సూచిస్తున్నారు.