వెలుగు ఓపెన్ పేజీ..లక్షల సంపద నష్టం.. పరిష్కారం ఏంటి?

వెలుగు ఓపెన్ పేజీ..లక్షల సంపద నష్టం.. పరిష్కారం ఏంటి?

దేశీయ స్టాక్ మార్కెట్‌ గత కొన్ని రోజులుగా అస్థిరతకు ప్రతీకగా మారింది. వరుసగా మూడు సెషన్లలో సూచీలు భారీగా పతనమవడం మదుపరుల్లో భయాందోళనలను రేకెత్తించింది. ఈ తక్కువ వ్యవధిలోనే  దాదాపు  రూ.14 లక్షల కోట్ల విలువైన సంపద  గాలిలో  కలిసిపోయింది. 

ఇది కేవలం సంఖ్యల కథ కాదు. దేశ ఆర్థిక వ్యవస్థపై, పెట్టుబడిదారుల మనోభావాలపై పడుతున్న లోతైన ప్రభావానికి ఇది సంకేతం. మార్కెట్‌ పతనం వెనుక ఉన్న కారణాలను లోతుగా పరిశీలిస్తే అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ మదుపరుల ప్రవర్తన, రంగాలవారీగా ఎదురవుతున్న సవాళ్లు అన్నీ కలిసివచ్చిన ఒక సంక్లిష్ట చిత్రమే కనిపిస్తుంది.

ప్ర  పంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి దేశీయ సూచీలపై తీవ్ర ఒత్తిడిని మోపుతోంది. అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లపై తీసుకుంటున్న కఠిన వైఖరి, యూరప్‌లో ఆర్థిక వృద్ధి మందగమన సంకేతాలు, పశ్చిమ ఆసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు పెట్టుబడుల ప్రవాహాన్ని దారి మళ్లిస్తున్నాయి. రిస్క్‌ తీసుకునే ధైర్యం తగ్గిన వేళ అంతర్జాతీయ పెట్టుబడిదారులు సురక్షిత ఆశ్రయాల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మార్కెట్‌ నుంచి మూలధనం బయటకు వెళ్లడం సహజ పరిణామంగా మారింది. విదేశీ సంస్థాగత మదుపరుల అమ్మకాల ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతుండటం సూచీలను  దిగజార్చుతోంది.

ఐటీ రంగం ఆర్డర్లపై అనుమానాలు!

దేశీయ స్థాయిలో చూస్తే కంపెనీల లాభాలపై అంచనాలు కొంత తగ్గుముఖం పట్టాయి. ముడిసరుకుల ధరల ఒడుదొడుకులు, రవాణా ఖర్చుల పెరుగుదల,  రూపాయి  మారక విలువలో బలహీనత అనేక రంగాలపై భారంగా మారాయి. ఐటీ రంగం ప్రత్యేకంగా దెబ్బతింటోంది. అమెరికా, యూరప్‌  మార్కెట్ల  నుంచి  ఆర్డర్లు తగ్గే అవకాశం ఉందన్న  అంచనాలు ఐటీ కంపెనీల షేర్లను అమ్మకాల వలయంలోకి నెట్టాయి. ఫార్మా, మెటల్స్‌, ఆటో రంగాల్లో కూడా లాభాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితి పెట్టుబడిదారులలో  అప్రమత్తతను పెంచింది.

మార్కెట్​ సైకాలజీ

గత కొన్ని నెలలుగా సూచీలు ఎగబాకుతూ రావడంతో విలువలు అధికస్థాయికి చేరాయి. లాభాల బుకింగ్‌కు ఇది సరైన సమయమని భావించిన పెద్ద మదుపరులు అమ్మకాలకు దిగారు. ఒకసారి అమ్మకాలు మొదలైతే అవి చైన్‌ రియాక్షన్‌లా మారాయి. చిన్న మదుపరుల్లో భయం పుట్టి వారు కూడా తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం పతనాన్ని వేగవంతం చేసింది. మార్కెట్‌ సైకాలజీ ఇక్కడ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థ బలహీనతను సూచిస్తున్నాయా అన్న ప్రశ్న సహజంగా తలెత్తుతుంది.

 వాస్తవానికి దేశీయ మౌలికాంశాలు ఇప్పటికీ బలంగానే ఉన్నాయి. జీడీపీ వృద్ధి రేటు ప్రపంచ సగటుతో పోలిస్తే మెరుగ్గా ఉంది. బ్యాంకింగ్‌ రంగంలో ఎన్‌పీఏలు నియంత్రణలో ఉన్నాయి. ప్రభుత్వ మూలధన వ్యయాలు ఆర్థిక చక్రాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. అయినా మార్కెట్‌ తాత్కాలికంగా  ఈ  సానుకూల అంశాలను పక్కనపెట్టి గ్లోబల్‌ ఒత్తిడికి లోనవుతోంది. ఒక్క  భారత మార్కెటే కాదు, అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.

సంక్షోభం తర్వాత పునరుజ్జీవం తప్పనిసరి

ఇలాంటి వేళ పరిష్కార మార్గాలపై చర్చ అవసరం.  ముందుగా విధానపరమైన స్థిరత్వం కీలకం. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి ఉందన్న సంకేతాలను స్పష్టంగా ఇవ్వాలి. వడ్డీరేట్లు, పన్నుల విధానంలో ఊహించని మార్పులు లేకుండా చూసుకోవడం మదుపరుల విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది.

 నియంత్రణ సంస్థలు మార్కెట్‌లో అనవసర ఊహాగానాలకు తావులేకుండా పారదర్శకతను పెంచాలి.  మదుపరుల స్థాయిలో చూస్తే సహనం ప్రధాన ఆయుధం. తాత్కాలిక ఒడుదొడుకులకు భయపడి నిర్ణయాలు తీసుకోవడం నష్టాలను మిగిల్చే ప్రమాదం ఉంది. బలమైన మౌలికాంశాలు ఉన్న కంపెనీలపై దృష్టి కేంద్రీకరించడం, విభిన్న రంగాల్లో పెట్టుబడులను విస్తరించడం రిస్క్​ను తగ్గిస్తుంది. మార్కెట్‌ పతనాలు ఎప్పటికీ శాశ్వతం కావని చరిత్ర చెబుతోంది. ప్రతి సంక్షోభం తరువాత పునరుజ్జీవనం తప్పనిసరి. 

- శ్రీనివాస్ గౌడ్ ముద్దం, ఫైనాన్స్ బిజినెస్ ఎక్స్​పర్ట్