లాభాలతో దుమ్ముదులిపిన మన స్టాక్ మార్కెట్లు.. కారణాలు ఇవే

లాభాలతో దుమ్ముదులిపిన మన స్టాక్ మార్కెట్లు.. కారణాలు ఇవే

సోమవారం ఉదయం మంచి లాభాలతో స్టార్ట్ అయిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరి వరకూ అదో జోష్ కొనసాగించాయి. మార్కెట్లో బుల్స్ దూకుడుగా కొనుగోళ్లకు దిగటంతో సూచీలు ముందుకు సాగాయి. మార్కెట్ల క్లోజింగ్ నాటికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1073 పాయింట్ల లాభంతో ఉండగా.. నిఫ్టీ సూచీ 312 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 1238 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 577 పాయింట్ల లాభంతో ముగిశాయి. అయితే ఆయిల్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ రేట్లను మళ్లీ పెంచటంతో ఇవాళ ఇంట్రాడేలో కంపెనీల స్టాక్స్ భారీగానే లాభపడ్డాయి. 

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన అద్భుతమైన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోతున్నాయి. ఇన్వెస్టర్లలో భయాలు తొలగి, కొనుగోళ్ల జోరు పెరగడానికి ప్రధానంగా 6 కీలక కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటంటే.. 

1. దిగొచ్చిన క్రూడ్ ఆయిల్..
ఇరాన్ యుద్ధానికి ముగింపు పలికేలా అమెరికా-ఇరాన్ దేశాలు శాంతి ఒప్పందానికి దగ్గరవుతున్నాయనే వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కుప్పకూలాయి. గ్లోబల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 5.58 శాతం తగ్గి, గత రెండు వారాల్లో మొదటిసారిగా 100 డాలర్ల మార్కు కంటే కింద బ్యారెల్‌కు 97.76 డాలర్లకు పడిపోయింది. ఈ తగ్గుదల భారత ఆర్థిక వ్యవస్థకు, కార్పొరేట్ కంపెనీల లాభాలకు పెద్ద ఊరటనిచ్చే అంశం.

2. ట్రంప్ ప్రకటన.. 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం చేసిన ఒక ప్రకటన మార్కెట్లలో భారీ భరోసానిచ్చింది. వాషింగ్టన్, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించిన అవగాహన ఒప్పందం దాదాపుగా ఖరారైందని చెప్పారు. దీనివల్ల యుద్ధానికి ముందు ప్రపంచ చమురు, ఎల్‌ఎన్‌జీ రవాణాలో ఐదో వంతు వాటా కలిగిన కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' తిరిగి తెరుచుకోనుంది. రెండు వైపులా చర్చలు నిదానంగా, పక్కాగా సాగుతున్నాయని ట్రంప్ తెలపడంతో ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది.

3. ప్రపంచ మార్కెట్ల నుంచి గ్రీన్ సిగ్నల్..
అంతర్జాతీయ మార్కెట్లు లాభాల బాట పట్టడం దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ, షాంఘై సూచీలు లాభాల్లో ట్రేడ్ కాగా.. అమెరికా మార్కెట్లు కూడా గత సెషన్‌ను లాభాలతో ముగించాయి. దీనికి తోడు నాస్‌డాక్, ఎస్ అండ్ పీ 500, డౌ జోన్స్ ఫ్యూచర్స్ కూడా 1.5 శాతం వరకు లాభాల్లో ట్రేడ్ అవ్వడం మార్కెట్ల బుల్ రన్‌కు గట్టి మద్దతును అందించింది.

4. డాలర్‌తో పోలిస్తే పుంజుకున్న రూపాయి..
అమెరికా-ఇరాన్ శాంతి చర్చల పురోగతితో భారత కరెన్సీ రూపాయి బలాన్ని పుంజుకుంది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 40 పైసలు పెరిగి 95.20 స్థాయికి చేరుకుంది. రూపాయి బలోపేతం కావడం దేశీయ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహానికి మరింత ఊతాన్ని ఇస్తుంది.

5. బ్యాంకింగ్ షేర్లకు పెరిగిన డిమాండ్..
క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో బ్యాంకింగ్ రంగం షేర్లు మార్కెట్లను ముందంజలో నడిపించాయి. ముఖ్యంగా కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ షేర్లు ఏకంగా 4 శాతం వరకు లాభపడ్డాయి. చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని, వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్ షేర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపారు.

6. ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్.. 
భారత్, అమెరికా దేశాల మధ్య త్వరలోనే తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ఖరారు కానుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలపడం మార్కెట్లలో సానుకూల వాతావరణాన్ని సృష్టించింది. దీనికి తోడు మార్కెట్ భయాందోళనలను సూచించే 'ఇండియా VIX' 2.5 శాతం తగ్గి 17.38 స్థాయికి పడిపోయింది. ఓలటాలిటీ ఇండెక్స్ తగ్గడం అంటే మార్కెట్లో రిస్క్ తీసుకునేందుకు ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారని అర్థం.