ఐటీ కారిడార్లో ఇండియన్ సూపర్క్రాస్ రేసింగ్‌ లీగ్‌

ఐటీ కారిడార్లో ఇండియన్ సూపర్క్రాస్ రేసింగ్‌ లీగ్‌

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్‌లో ఇండియన్‌ సూపర్‌ క్రాస్‌ రేసింగ్‌ లీగ్‌ శనివారం అట్టహాసంగా జరిగింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ లీగ్​కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అథ్లెటిక్ గ్రౌండ్‌లో నిర్వహించిన రేసింగ్ బైకుల విన్యాసాలు అబ్బురపరిచాయి. రెండో రౌండ్‌ పోటీల్లో బైక్ రైడర్లు తమ రైడింగ్ స్కిల్స్ తో మెప్పించారు. 

రేసింగ్ లీగ్ కోసం అథ్లెటిక్ స్టేడియం ఆవరణలో మట్టి కుప్పలతో అచ్చమైన రేసింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేశారు. రేసింగ్ ఈవెంట్‌కు ముందు బైక్ షోకేస్ ఏర్పాటు చేసి రేసులో పాల్గొన్న బైకులను ప్రదర్శించారు. దీంతోపాటు రేసర్ల రైడర్ మీట్‌ను నిర్వహించారు. ఎంటర్‌టైనమెంట్‌ జోన్‌లో భాగంగా నిర్వహించిన లైవ్ మ్యూజిక్  ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. 

250 సీసీ ఇండియా అండ్ ఆసియా, 250సీసీ, 450 సీసీ ఇంటర్నేషనల్ కేటగిరీలో రేసర్లు పోటీ పడ్డారు. లీగ్‌లో భాగంగా రేసర్లు ఒళ్ళు గగుర్పొడిచే ఫుల్ ట్రోటల్ స్టంట్‌లు ప్రదర్శించారు. బీబీ రేసింగ్, గుజరాత్ ట్రయల్ బ్లాజర్, బిగ్ రాక్ మోటార్ స్పోర్ట్స్, ట్రై కలర్ కేటీఎమ్‌, ఇండి వీల్స్ వంటి టీమ్‌లు పోటీపడ్డాయి.