- పెట్టుబడులు, విలీనాలు, వాటా కొనుగోళ్లతో కళకళలాడిన టెక్నాలజీ రంగం
- రూ.12 వేల కోట్ల విలువైన డీల్స్ జరిగాయన్న గ్రాంట్ థార్నటన్
- ఏఐ, ఆటోమేషన్, సాస్ కంపెనీలపై ఫోకస్ పెట్టిన ఇన్వెస్టర్లు
- ఇతర కంపెనీలను కొన్న విప్రో, ఇన్ఫోసిస్, హెక్సావేర్
న్యూఢిల్లీ: గ్లోబల్‌గా ఎన్ని సవాళ్లు ఉన్నా, ఇండియన్ టెక్ సెక్టార్ మాత్రం సెప్టెంబర్ క్వార్టర్‌లో కళకళలాడింది. సుమారు రూ.12,000 కోట్ల (1.48 బిలియన్ డాలర్ల) విలువైన పెట్టుబడి ఒప్పందాలు, విలీనాలు, వాటా కొనుగోళ్ల డీల్స్ నమోదయ్యాయి. ఇప్పటివరకు ఎక్కువగా చిన్న మొత్తాల డీల్స్ జరిగితే, ఈసారి పెద్ద సైజ్ పెట్టుబడులు ఎక్కువగా కనిపించాయి. రూ.400 కోట్ల (50 మిలియన్ డాలర్ల) కంటే ఎక్కువ విలువ ఉన్న డీల్స్ సంఖ్య జూన్ క్వార్టర్‌తో పోలిస్తే సెప్టెంబర్ క్వార్టర్‌లో నాలుగు రెట్లు పెరిగిందని గ్రాంట్ థార్నటన్ భారత్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. వీటి మొత్తం విలువ ఐదు రెట్లు పెరిగిందని తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం, సెప్టెంబర్ క్వార్టర్‌లో ఇండియా టెక్ సెక్టార్‌లో మొత్తం 80 డీల్స్ రికార్డయ్యాయి. అంతకుముందు క్వార్టర్‌తో పోలిస్తే ఇది 33 శాతం ఎక్కువ. పెట్టుబడిదారులు ఏఐ, సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్), సంస్థల పనితీరును ఆటోమేటిక్ చేసే టెక్నాలజీలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
విదేశీ కంపెనీల్లోనూ వాటాల కొనుగోళ్లు..
దేశీయంగా కంపెనీలు ఒకదానిని మరొకటి కొనుగోలు చేయడం ఎక్కువగా కనిపించింది. ఆల్టిమెట్రిక్ సంస్థ ఎస్‌ఎల్‌కే సాఫ్ట్‌వేర్‌ను, బ్రిలియంట్ ఐటీ సొల్యూషన్స్ సంస్థ సుగన్సా సొల్యూషన్స్‌ను కొనుగోలు చేయడం ముఖ్యమైన డీల్స్‌లో ఉన్నాయి. విదేశాల్లో కూడా భారత కంపెనీలు పెద్ద డీల్స్ నమోదు చేశాయి. కేపీఐటీ టెక్నాలజీస్ స్విస్ కంపెనీ ఎన్‌డ్రీమ్ ఏజీలో , కోవసాంట్ టెక్నాలజీ అమెరికా సబ్సిడరీలో వాటాలు కొనుగోలు చేసింది. ఇండియన్ టెక్ సెక్టార్‌లో సెప్టెంబర్ క్వార్టర్‌లో ప్రైవేట్ పెట్టుబడులు, వెంచర్ క్యాపిటలిస్టుల ద్వారా 50 డీల్స్ జరిగాయి. వీటి మొత్తం విలువ రూ.4,800 కోట్ల (584 మిలియన్ డాలర్ల) కు చేరుకుంది. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే ఇది వాల్యూమ్ పరంగా 39 శాతం, విలువ పరంగా 172 శాతం ఎక్కువ. ప్రైవేట్ పెట్టుబడులు, వెంచర్ క్యాపిటల్ కంపెనీల నుంచి ఫ్రాక్టల్ అనలిటిక్స్ రూ.1,400 కోట్ల (172 మిలియన్ డాలర్ల) పెట్టుబడి పొందగా, గప్‌షుప్ రూ.490 కోట్లు (60 మిలియన్ డాలర్లు), మోఎంగేజ్, వాట్‌ఫిక్స్ రూ.140 కోట్ల (17 మిలియన్ డాలర్ల) చొప్పున ఫండ్స్ సేకరించగలిగాయని గ్రాంట్థార్న్టన్ తెలిపింది.
స్టార్టప్‌లలో తగ్గిన పెట్టుబడులు
స్టార్టప్‌లలో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు సెప్టెంబర్ క్వార్టర్‌లో కొంత తగ్గాయి. రూ.525 కోట్ల (63 మిలియన్ డాలర్ల)తో 22 డీల్స్ మాత్రమే జరిగాయి. క్లుయిజ్ ఏఐ (రూ.77 కోట్లు), ప్రీసాల్వ్360 (రూ.38 కోట్లు), మైయూటిక్ సెమీకండక్టర్స్ వంటి సంస్థలు ఏఐ చిప్ ఆటోమేషన్ రంగంలో నిధులు సేకరించాయి. టెక్ సేవల రంగంలో విలీనాలు మూడు రెట్లు పెరిగాయి. మొత్తం రూ.5,500 కోట్ల (657 మిలియన్ డాలర్ల) విలువైన 18 డీల్స్ జరిగాయి. విప్రో రూ.3,100 కోట్ల (375 మిలియన్ డాలర్ల), ఇన్ఫోసిస్ రూ.1,250 కోట్ల (151 మిలియన్ డాలర్ల) , హెక్సావేర్ రూ.1,000 కోట్ల (120 మిలియన్ డాలర్ల) విలువైన కొనుగోళ్లు చేశాయి. క్లౌడ్, ఆటోమేషన్ వంటి ఆధునిక టెక్నాలజీలపై ఇవి దృష్టి పెట్టాయి.
