యూరప్ ట్రిప్ అనగానే గుర్తొచ్చేది అందమైన స్విట్జర్లాండ్. అక్కడి మంచు కొండలు, ప్రశాంతమైన రోడ్లపై లాంగ్ డ్రైవ్‌కు వెళ్లడం ప్రతి ఒక్కరి డ్రీమ్. ఓ భారతీయ మహిళా పర్యాటకురాలు కూడా సరిగ్గా ఇలాగే ప్లాన్ చేసుకుంది. స్విట్జర్లాండ్‌కు వెళ్లి హ్యాపీగా వెకేషన్ ఎంజాయ్ చేసి ఇండియాకు తిరిగి వచ్చేసింది. అంతా సజావుగానే సాగిపోయింది అనుకుంటున్న సమయంలో సరిగ్గా ఏడాది తర్వాత ఆమెకు ఊహించని విధంగా ఒక భారీ షాక్ తగిలింది. ఆమె వెకేషన్ ముగించుకుని ఇంటికి వచ్చిన ఏడాదికి స్విస్ ప్రభుత్వం నుంచి ఒక లెటర్ వచ్చింది. ట్రిప్ సమయంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు పడిన భారీ జరిమానా చలానాకి సంబంధించిన లెటర్ అది.
ఆ చలానా చూసిన సదరు మహిళకు మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకంటే ఆ ట్రాఫిక్ ఫైన్ మొత్తం అక్షరాలా రూ.లక్షా 50వేలు. అసలు అంత కాలం తర్వాత అంత పెద్ద మొత్తంలో ఫైన్ పడటంతో ఏం చేయాలో పాలుపోని ఆమె.. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X'లో షేర్ చేసింది. "పోన్ సప్డి" అనే పేరుతో ఉన్న ఆ మహిళ.. స్విట్జర్లాండ్ పర్యటన ముగించుకుని వచ్చిన ఏడాది తర్వాత చలానా అందిందని, ఇంత లేట్‌గా వచ్చిన ఈ ఫైన్‌ను అప్పీల్ చేయడానికి, తగ్గించుకోవడానికి లేదంటే పూర్తిగా రద్దు చేయించుకోవడానికి ఏమైనా మార్గం ఉందా అని నెటిజన్లను సలహా కోరింది. ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైందా అని ఆమె ఆరా తీసే ప్రయత్నం చేసింది సోషల్ మీడియా ద్వారా.
Has anyone here received a traffic violation fine from Switzerland months after returning from a vacation?
— Poan Sapdi (@Poan__Sapdi) May 30, 2026
We just received a challan of almost ₹1 lakh, nearly a year after our trip. We’re trying to understand if there’s any way to appeal, reduce, or get it waived.
ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో పాటు ఏకంగా 1.3 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. విదేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల్లో ఇది పెద్ద చర్చకు దారితీసింది. విదేశాల్లో కార్లు రెంట్స్ తీసుకునేటప్పుడు అక్కడి లోకల్ ట్రాఫిక్ రూల్స్, రెంటల్ అగ్రిమెంట్లు ఎంత జాగ్రత్తగా పరిశీలించాలో ఈ ఘటన అందరికీ కనువిప్పు కలిగించింది. సాధారణంగా విదేశాల్లోని రెంటల్ కంపెనీలు ట్రాఫిక్ ఫైన్‌తో పాటు తమ అడ్మిన్ ఫీజును కూడా కలిపి పంపుతాయి. వాటిని లైట్ తీసుకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయి.
ఈ పోస్టుపై స్పందించిన నెటిజన్లు సలహాలు ఇచ్చారు. స్విట్జర్లాండ్‌లో ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయని, అక్కడ జరిమానాలు రద్దు చేయడం అసాధ్యమని కొందరు వెల్లడించారు. అంతర్జాతీయంగా ఇలాంటి ఫైన్స్ రద్దు చేయాలని కోరితే జరిమానా మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉందని, వెంటనే కట్టేయడమే మంచిదని సూచించారు. లేదంటే భవిష్యత్తులో షెన్జెన్ వీసా దొరకడం కష్టమవుతుందని.. బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మరో యూజర్ తనకు కూడా గతంలో రూ.10వేలు ఫైన్ పడిందని పేర్కొన్నారు.
దీనికి ఆ మహిళ సమాధానమిస్తూ.. తాము ఫైన్ కట్టడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే అంత లేట్‌గా లెటర్ పంపినందుకు గానూ కట్టిన లేట్ ఫీజుపై మాత్రమే తాము అప్పీల్ చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేసింది. స్విస్ ఫైన్స్ చాలా ఎక్కువగా ఉంటాయని, వాటిని సకాలంలో కట్టకపోతే వడ్డీలు పెరుగుతాయని, ఒకవేళ అంత మొత్తం ఒకేసారి కట్టలేకపోతే ఇన్‌స్టాల్‌మెంట్ ఆప్షన్ అడగవచ్చని కొందరు స్మార్ట్ టిప్స్ ఇచ్చారు. మొత్తం మీద ఈ ఘటన విదేశీ ప్రయాణాలు చేసే వారికి పెద్ద హెచ్చరిక అనే చెప్పాలి.
