చంద్రయాత్రకు ‘బాల్​ వీర్​’.. 26 ఏళ్ల దేవ్​ జోషికి అరుదైన అవకాశం

చంద్రయాత్రకు ‘బాల్​ వీర్​’.. 26 ఏళ్ల దేవ్​ జోషికి అరుదైన అవకాశం

‘బాల్​ వీర్​’ పాత్రలో ఆబాలగోపాలాన్ని అలరించిన టీవీ నటుడు దేవ్​ జోషిని అరుదైన అవకాశం వరించింది. వచ్చే ఏడాది (2023 సంవత్సరంలో) చంద్రుడి యాత్రకు వెళ్లనున్న స్పేస్​ ఎక్స్​ రాకెట్లో ఆయన బెర్త్​ ఖరారైంది. జపాన్​ కు చెందిన బిలియనీర్​ యుసాకూ మేజావా తనతో పాటు మరో 8 మందిని మూన్​ టూర్​ కోసం ఎంపిక చేశారు. ఈజాబితాలో మన దేశానికి చెందిన టీవీ నటుడు 26 ఏళ్ల దేవ్​ జోషి పేరు కూడా ఉంది. ఈ తరుణంలో ఇన్​ స్టాగ్రామ్ వేదికగా దేవ్​ జోషి స్పందించారు. ఈ గొప్ప చారిత్రక ప్రాజెక్టులో భాగమయ్యే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉందన్నారు. “జీవితం నన్నెప్పుడూ కొత్త కొత్త అవకాశాలతో ఆశ్చర్యపరిచింది. నేనెప్పుడూ కలలోనూ ఊహించని మరో గొప్ప అవకాశం నన్ను వరించింది. భారత దేశం తరపున ఈ ప్రాజెక్టులో పాల్గొనబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని పేర్కొంటూ జోషి తన ఇన్​ స్టా ఖాతాలో పోస్ట్​ చేశారు. మూడేళ్ల వయసు నుంచే సీరియళ్లలో నటించడం ప్రారంభించిన దేవ్​ జోషికి 2019 సంవత్సరంలో ‘బాల్​ శక్తి పురస్కార్​’ వచ్చింది. 

ఆ రెండు సీరియల్స్​ తో పేరు ప్రఖ్యాతులు.. 

బాల్​ వీర్​ అనే ప్రధాన పాత్రలో దేవ్​ జోషి నటించిన ‘బాల్​ వీర్​’ సీరియల్​  ‘సోనీ సబ్​’ చానల్​లో  2012 అక్టోబరు 8 నుంచి ప్రసారమైంది. 2016 నవంబరు 4 వరకు దీనికి సంబంధించిన 1,111 ఎపిసోడ్లు ప్రసారమై సరికొత్త రికార్డును సృష్టించాయి. దీన్నిబట్టి ఆ సీరియల్ కు ఎంత క్రేజ్​ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. దీనికి కొనసాగింపుగా సోనీ సబ్​ చానల్​ లోనే 2019 సెప్టెంబరు 10 నుంచి ‘బాల్​ వీర్​ రిటర్న్స్’ సీరియల్​  ప్రసారం మొదలైంది. 2021 ఏప్రిల్​ 2 వరకు దీనికి సంబంధించిన 354 ఎపిసోడ్లు ప్రసారం చేశారు. 

మూన్​ టూర్కు వెళ్లే మిగతా వారిలో.. 

ఎలాన్​ మస్క్​ కు చెందిన స్పేస్​ ఎక్స్​ కంపెనీ  ‘డియర్​ మూన్​’ ప్రాజెక్టు పేరుతో మూన్​ టూర్​ ను 2023 సంవత్సరంలో నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ప్లానింగ్​ 2018 సంవత్సరంలోనే జరిగింది. మూన్​ టూర్​ కోసం వెళ్లే స్పేస్​ ఎక్స్​ రాకెట్లోని మొత్తం 9 సీట్లను జపాన్​ బిలియనీర్​ యుసాకూ మేజావా ఒక్కరే 2018లోనే కొనేశారు. ఈ చంద్రయాత్ర కోసం జపాన్​ బిలియనీర్​ యుసాకూ మేజావా, దేవ్​ జోషితో కలిసి వెళ్లనున్న వారిలో మ్యూజిక్​ ప్రొడ్యూసర్​ స్టీవ్​ ఓకీ, యూట్యూబర్​ టిమ్​ డోడ్​, ఆర్టిస్ట్​ యెమీ ఎడి, ఫొటోగ్రాఫర్లు కరీం ఇలియా, రియానాన్​ ఆడం, ఫిల్మ్​ మేకర్​ బ్రెండాన్​ హాల్​, కొరియన్​ సింగర్​ టాప్​ ఉన్నారు.  ఇక అమెరికా స్నో బోర్డర్​ కైట్లిన్​ ఫారింగ్టన్​, జపాన్​ డ్యాన్సర్​ మియూలను కూడా ఇందుకోసం ఎంపిక చేశారు. అయితే క్రూ టీమ్​ లోని ఎవరైనా గైర్హాజరైతే వారి స్థానంలో ఈ ఇద్దరికి అవకాశం కల్పిస్తారు.