అమెరికాలో భార్య, ముగ్గురు బంధువుల్ని కాల్చి చంపిన ఎన్నారై ..

అమెరికాలో భార్య, ముగ్గురు బంధువుల్ని కాల్చి చంపిన ఎన్నారై ..

న్యూయార్క్: కుటుంబంలో వచ్చిన మనస్పర్థలతో అమెరికాలో నివాసముంటున్న ఓ భారతీయుడు ఘోరానికి పాల్పడ్డాడు. భార్యతోపాటు ఆమె బంధువులను కాల్చి చంపాడు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న పిల్లలు భయంతో  దాక్కున్నారు. జార్జియాలోని లారెన్స్‌‌విల్లే నగరంలో శుక్రవారం ఉదయం (అమెరికా టైం) జరిగిన ఈ ఘటనలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అట్లాంటాలోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. అట్లాంటాలో నివాసముంటున్న భారత సంతతి వ్యక్తి విజయ్ కుమార్ (51) తన కుటుంబ సభ్యులతో ఏర్పడిన వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులను విజయ్ కుమార్ భార్య మీము డోగ్రా (43), గౌరవ్ కుమార్ (33), నిధి చందర్(37), హరీశ్‌‌ చందర్ (38)గా గుర్తించారు. వీరిలో ఒకరు భారతీయ పౌరులు కాగా, మిగిలిన వారు భారత సంతతికి చెందిన వారు.

అల్మారాలో నక్కిన చిన్నారులు

తండ్రి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడుతున్న సమయంలో ముగ్గురు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. కాల్పుల శబ్దం విన్న చిన్నారులు ప్రాణభయంతో ఒక అల్మారాలో దాక్కున్నారు. అందులో ఒక చిన్నారి సమయస్ఫూర్తితో 911కు ఫోన్ చేసి సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పిల్లలు క్షేమంగా ఉన్నారని, ప్రస్తుతం వారిని బంధువుల సంరక్షణలో ఉంచామని అధికారులు తెలిపారు. నిందితుడు విజయ్ కుమార్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనపై అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర సంతాపం వ్యక్తంచేసింది. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నామని, అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది.