
ఇజ్రాయెల్‌లో దారుణ ఘటన జరిగింది. ఇంటిపై రాకెట్ కూలి కేరళకు చెందిన మహిళ మృతిచెందింది. ఇడుక్కి జిల్లాలోని కీరితోడుకు చెందిన సౌమ్య (31) గత ఏడు సంవత్సరాలుగా ఇజ్రాయెల్‌లోని అష్కెలోన్ సిటీలో హౌస్ కీపర్‌గా పనిచేస్తుంది. ఆమె మంగళవారం కెరళలోని తన భర్త సంతోష్‌తో వీడియో కాల్ మాట్లాడుతుండగా పాలస్తీనా రాకెట్ ఇంటిపై కూలింది. దాంతో ఒక్కసారిగా పెద్దశబ్దం వచ్చింది. సౌమ్య ఫోన్ సడెన్‌గా డిస్ కనెక్ట్ కావడంతో.. సంతోష్ వెంటనే సౌమ్య పనిచేసే చోట ఉన్న ఇతరులకు ఫోన్ చేశాడు. అప్పుడు ఈ విషాద ఘటన గురించి తెలిసింది. కాగా.. ఈ సంఘటన ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరణ కాలేదు. అయితే ఇడుక్కి జిల్లాలోని పాల నియోజకవర్గానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే నేషనలిస్ట్ కాంగ్రెస్ నాయకుడు మణి కప్పన్ ఈ ఘటనను ఖండించారు. సౌమ్య మృతిపట్ల ఆమె కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. ఈ ఘటన పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని సౌమ్య మృతదేహాన్ని వెంటనే కేరళకు వచ్చేలా చూడాలని ఆయన కోరారు.