
న్యూజిలాండ్ టూర్ లో బిజీగా ఉన్న ఇండియా విమెన్స్ టీమ్ మరో సిరీస్ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. మెన్స్ మాదిరిగానే వన్డే సిరీస్ లో కివీస్ ను చిత్తు చేసిన ఇండియా విమెన్స్ టీమ్ బుధవారం నుంచి ఆ జట్టుతో టీ 20 సిరీస్ ఆడనుంది. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇండియా జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. గతేడాది చివర్లో వెస్టిండీస్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ సెమీస్ లో ఓటమి పాలైన తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి టీ20 సిరీస్ ఇదే. ఇంగ్లండ్ తో జరిగిన సెమీస్ లో మిథాలీరాజ్ ను తప్పించడం.. ఇండియా ఓడిపోవడంతో మొదలైన వివాదం కొత్త కోచ్ నియామకం తర్వాత సద్దు మణిగింది. రమేశ్ పొవార్ స్థానంలో కోచ్ గా బాధ్యతలు చేపట్టిన డబ్ల్ యువీ రామన్ పర్యవేక్షణలో ఇండియా కివీస్ పై తొలి వన్డే సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. అదే ఉత్సాహంతో బుధవారం నుంచి మొదలయ్యే టీ20 సిరీస్ కు రెడీ అయింది. వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ టీ 20ల్లో పెద్దగా ఆడలేకపోతుంది. దీంతో పాటు కివీస్ స్పిన్నర్లను ఆశించిన స్థాయిలో ఎదుర్కొనలేకపోతున్న ఇండియా టీ20ల్లో భారీ స్కో రుపైనే ఆశలుపెట్టుకుంది. ముఖ్యంగా కివీస్ తో వన్డేలో సెంచరీ బాదిన స్టార్ ప్లేయర్ స్మ్రతి మంధానతో పాటు హర్మన్ ప్రీత్ టీ20ల్లో నూ చెలరేగిపోతే తిరుగుండదని టీమిండియా ఆశిస్తోంది.
టీ20లకు మిథాలీ గుడ్ బై!
టీమిండియా మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ త్వరలో టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పనుందని సమాచారం. వచ్చే నెల 4 నుంచి స్వదేశంలో ఇంగ్లండ్ తో జరిగే సిరీస్ తర్వాత మిథాలీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడే జట్టులో ఉన్న మిథాలీకి తుది జట్టులో ఆడే ఛాన్స్‌దక్కకపోవచ్చు. 2020 వరల్డ్ టీ20లో ఆడే ఉద్దేశం లేనందువల్లే మిథాలీ రిటైర్మెంట్ యోచనలో ఉందని తెలుస్తోంది.