ఇండియా విమెన్స్‌‌ హాకీ టీమ్‌‌ చేజారిన ఒలింపిక్ బెర్త్

ఇండియా విమెన్స్‌‌ హాకీ టీమ్‌‌  చేజారిన ఒలింపిక్ బెర్త్
  •     క్వాలిఫయర్స్ థర్డ్ ప్లేస్‌‌ మ్యాచ్‌‌లో జపాన్‌‌ చేతిలో ఓటమి

రాంచీ: ఇండియా విమెన్స్‌‌ హాకీ టీమ్‌‌ ఒలింపిక్ కల చెదిరింది. ఈ ఏడాది పారిస్‌‌లో జరిగే ఒలింపిక్స్‌‌కు క్వాలిఫై అవ్వలేకపోయింది. సొంతగడ్డపై ఎఫ్‌‌ఐహెచ్‌‌ ఒలింపిక్‌‌ క్వాలిఫయర్స్‌‌ టోర్నీలో  శుక్రవారం జరిగిన మూడో ప్లేస్‌‌  మ్యాచ్‌‌లో ఇండియా 0–1తో జపాన్‌‌ చేతిలో పరాజయం పాలైంది.  దాంతో పారిస్ బెర్త్‌‌ చేజారింది.  ఆరో నిమిషంలోనే లభించిన పెనాల్టీ కార్నర్‌‌‌‌ను గోల్‌‌గా మలిచిన కనా ఉరాట జపాన్‌‌ను గెలిపించింది. 

సెమీస్‌‌లో బలమైన జర్మనీతో హోరాహోరీగా తలపడి షూటౌట్‌‌లో ఓడిన ఇండియా అమ్మాయిలు ఈ పోరులో తీవ్రంగా నిరాశ పరిచారు. పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేసుకోవడంలో తమ బలహీనతను మరోసారి బయటపెట్టారు.. చివరి 11 నిమిషాల్లో మూడు సహా మ్యాచ్‌‌ మొత్తంలో ఇండియాకు  తొమ్మిది పెనాల్టీ కార్నర్లు లభించాయి. కానీ వీటిలో ఒక్కదాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోవడం ఆతిథ్య జట్టును దెబ్బకొట్టింది. ఇండియాను ఓడించి మూడో ప్లేస్‌‌తో జపాన్‌‌ పారిస్ బెర్తు సొంతం చేసుకుంది. మరోవైపు ఫైనల్లో జర్మనీ 2–0తో అమెరికాను  ఓడించి  క్వాలిఫయర్స్‌‌ టోర్నీ చాంపియన్‌‌గా నిలిచింది. ఫైనల్‌‌ చేరడంతోనే ఈ రెండు జట్లు పారిస్‌కు క్వాలిఫై అయ్యాయి.