Blind T20 World Cup: మహిళల అంధుల ప్రపంచ కప్ విజేత భారత్.. ఫైనల్లో నేపాల్‌పై గ్రాండ్ విక్టరీ

Blind T20 World Cup: మహిళల అంధుల ప్రపంచ కప్ విజేత భారత్.. ఫైనల్లో నేపాల్‌పై గ్రాండ్ విక్టరీ

టీ20 అంధుల మహిళా వరల్డ్ కప్ ను ఇండియా గెలుచుకుంది. తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన అంధుల మహిళలు చరిత్ర సృష్టించారు. ఆదివారం (నవంబర్ 23) ముగిసిన ఫైనల్లో నేపాల్ పై అలవోక విజయాన్ని సాధించి జగజ్జేతగా నిలిచింది. పి. సారా ఓవల్‌లో జరిగిన ఫైనల్‌లో నేపాల్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్ లో నేపాల్ మొదటగా  బ్యాటింగ్ చేసి  5 వికెట్లకు 114 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత జట్టు 12 ఓవర్లలో 3 వికెట్లకు 117 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 

ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో నేపాల్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. నేపాల్ బ్యాటింగ్ దిగిన తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో నేపాల్ వేగంగా పరుగులు చేయడంలో విఫలమైంది. మొత్తం ఇన్నింగ్స్ లో కేవలం ఒక్క బౌండరీ మాత్రమే ఇచ్చారు. దీంతో నేపాల్ కేవలం 114 పరుగులకే పరిమితమైంది. నేపాల్ జట్టులో సరితా ఘిమిరే 35 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. లక్ష్య ఛేదనలో ఇండియా ఆడుతూ పాడుతూ ఛేజ్ చేసింది. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేజ్ చేశారు. ఓపెనర్ ఫూలా సరెన్ 27 బంతుల్లో 44 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది.