అంబరాన్నంటిన భారత మహిళల జట్టు సంబరాలు

అంబరాన్నంటిన భారత మహిళల జట్టు సంబరాలు

మహిళ ఆసియాకప్ను టీమిండియా గెలుచుకుంది. అన్ని విభాగాల్లో శ్రీలంకను చిత్తు చేసి..ఏడోసారి ఆసియాకప్ను సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం భారత మహిళా ప్లేయర్లు సంబరాలు అంబరాన్నంటాయి. డ్యాన్సులతో అదరగొట్టారు. 

కలర్ పేపర్స్ చల్లుకుంటూ...
ఆసియాకప్ విజయంతో...ప్లేయర్లు మామూలుగా సెలబ్రేట్ చేసుకోలేదు. పంజాబీ డాన్సులతో ఎంజాయ్ చేశారు.  ట్రోఫీ అందుకునే సమయంలో గాల్లోకి వెదజల్లిన కలర్ పేపర్స్‌ను ఏరుకుని ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. ఇక కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ అయితే.... గ్రౌండ్‌లో పడుకుని సంబరాలు చేసుకుంది. మిగతా ప్లేయర్లు..ఆమెపై కలర్ పేపర్లు చల్లుతూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. 

లంక విలవిల..
ఫైనల్లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 65 పరుగులే చేయగలిగింది. ఓపెనర్లు చమరీ ఆటపట్టు , అనుష్క సంజీవని ఇద్దరూ రనౌట్‌ అయ్యారు.  ఆ తర్వాత రేణుకా సింగ్‌ లంక నడ్డి విరిచింది. నాలుగో ఓవర్లో వరుసగా మూడు వికెట్లను పడగొట్టింది.  ఆ తర్వాత రాజేశ్వరీ, స్నేహ్‌ రాణా బౌలింగ్‌లో రెచ్చిపోవడంతో లంక కోలుకోలేకపోయింది. 

ఈజీగా ఛేదించింది..
66 పరుగుల టార్గెట్ను భారత మహిళల జట్టు 2 వికెట్లు నష్టపోయి 8.3 ఓవర్లలోనే ఛేదించింది.  స్మృతి మంధాన  అజేయ హాఫ్‌ సెంచరీ సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 11 పరుగులతో రాణించింది. ఈ విజయంతో ఉమెన్స్ టీమ్ ఏడోసారి ఆసియాకప్ను సొంతం చేసుకుంది.