553.11 బిలియన్​ డాలర్లకు పడిపోయిన ఫారెక్స్​

553.11 బిలియన్​ డాలర్లకు పడిపోయిన ఫారెక్స్​

న్యూఢిల్లీ: మనదేశ ఫారిన్​ ఎక్స్​చేంజ్​ రిజర్వులు ఈ నెల నాటికి ఎనిమిది బిలియన్​ డాలర్లు తగ్గి 553.11 బిలియన్​ డాలర్లకు పడిపోయాయి. 2020 అక్టోబరు తొమ్మిది తరువాత ఫారెక్స్​ ఇంతలా తగ్గడం ఇదే మొదటిసారని ఆర్​బీఐ ప్రకటించింది. ఈ ఏడాది జులై తరువాత ఫారెక్స్ ​రిజర్వులు బాగా తగ్గాయని పేర్కొంది. పోయిన వారం వీటి విలువ 561.05 బిలియన్​ డాలర్లు. వరుసగా ఐదు వారాలుగా ఇవి తగ్గుతూనే ఉన్నాయి. గోల్డ్​ అసెట్ల విలువ కూడా ఈ నెల రెండు నాటికి 39.64 బిలియన్​ డాలర్ల (అంతకుముందు వారం విలువ) నుంచి 38.30 బిలియన్​ డాలర్లకు పడింది.

డాలర్​తో రూపాయి మారకం విలువ తగ్గకుండా అడ్డుకోవడానికి ఆర్​బీఐ భారీగా డాలర్లను అమ్మడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇన్​ఫ్లేషన్​ను తట్టుకోవడానికి ఇండియా సహా చాలా దేశాలు వడ్డీరేట్లను పెంచాయి. దీంతో రూపాయి విలువలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అయితే రూపాయితోపాటు ఇతర దేశాల కరెన్సీల విలువ బాగా తగ్గిందని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ ఇటీవల అన్నారు. నిజానికి ఇతర దేశాలతో పోలిస్తే రూపాయి తగ్గుదల తక్కువేనని పేర్కొన్నారు.