
ముంబై: మనదేశ ఫారెక్స్ నిల్వలు ఈ నెల రెండో తేదీన ముగిసిన వారానికి 2.065 బిలియన్ డాలర్లు తగ్గి 686.064 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం తెలిపింది. అంతకు ముందు వారంలో రిజర్వుల విలువ 1.983 బిలియన్ డాలర్లు పెరిగి 688.129 బిలియన్లకు చేరుకుంది. 2024 సెప్టెంబర్ చివరి నాటికి ఫారెక్స్ నిల్వలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 704.885 బిలియన్లకు చేరుకున్నాయి.
ఈ నెల రెండో తేదీతో ముగిసిన వారంలో, నిల్వలలో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తుల విలువ 514 మిలియన్ డాలర్లు పెరిగి 581.177 బిలియన్లకు చేరుకుంది. ఈ వారంలో బంగారం నిల్వల విలువ 2.545 మిలియన్ డాలర్లు తగ్గి 81.82 బిలియన్లకు చేరుకుందని ఆర్బీఐ తెలిపింది. ఐఎంఎఫ్‌తో భారతదేశ రిజర్వ్ స్థానం కూడా రిపోర్టింగ్ వారంలో 3 మిలియన్ డాలర్లు తగ్గి 4.509 బిలియన్లకు చేరుకుందని ఆర్బీఐ తెలిపింది.