కటక్:
టీ20 ఫార్మాట్‌లో తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. సొంతగడ్డపై వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ ప్రిపరేషన్స్‌ను సూర్యకుమార్ సేన గ్రాండ్ విక్టరీతో షురూ చేసింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (28 బాల్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 నాటౌట్) తన రీఎంట్రీని ఘనంగా చాటుకున్న వేళ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో మంగళవారం జరిగిన తొలి టీ20లో ఇండియా 101 రన్స్ తేడాతో గెలిచింది.
తొలుత ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 175/6 స్కోరు చేసింది. పాండ్యాతో పాటు తిలక్ వర్మ (26), అక్షర్ పటేల్ (23) రాణించారు. లుంగి ఎండిగి మూడు, సిపామ్ల రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌లో సఫారీ టీమ్ 12.3 ఓవర్లలో 74 రన్స్ కే కుప్పకూలింది. బ్రెవిస్ (22) టాప్ స్కోరర్. అర్ష్‌దీప్, బుమ్రా, చక్రవర్తి, అక్షర్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఓ వికెట్ తీసిన పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య ముల్లన్‌పూర్‌లో గురువారం రెండో టీ20 జరుగుతుంది.
పాండ్యా ధనాధన్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఎర్ర మట్టి పిచ్‌పై సౌతాఫ్రికా పేసర్ ఎంగిడి తెలివైన బౌలింగ్‌తో ఆతిథ్య బ్యాటర్లను ఇబ్బందిపెట్టాడు. మెడ నొప్పి నుంచి కోలుకొని బరిలోకి దిగిన వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (4) తన తొలి బాల్‌కే ఫోర్‌తో ఖాతా తెరిచినా.. తర్వాతి బాల్‌కే యాన్సెన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12) తన పేలవ ఫామ్ కొనసాగించాడు. ఎంగిడి బౌలింగ్‌లో వరుసగా 4, 6 కొట్టిన అతను మరో షాట్‌కు ట్రై చేసి మార్‌క్రమ్‌కు చిక్కాడు. డ్యాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (17) పవర్ ప్లేలో ధాటిగా ఆడలేకపోయాడు.
ఏడో ఓవర్లో సిపామ్ల బౌలింగ్‌లో వెంటవెంటనే రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చేలా కనిపించిన అతను భారీ షాట్‌కు ప్రయత్నించి యాన్సెన్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు వెనుదిరిగాడు. దాంతో 48/3తో ఇండియా ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో తిలక్, అక్షర్ పటేల్ కాస్త జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. దాంతో సగం ఓవర్లకు హోమ్ టీమ్ 71/3తో నిలిచింది. మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన ఎంగిడి క్రీజులో కుదురుకున్న తిలక్‌ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు.
అయితే, ఆసియా కప్ తర్వాత 74 రోజుల గ్యాప్ తీసుకొని జట్టులోకి వచ్చిన హార్దిక్ ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. బరోడా తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఫిట్‌నెస్ నిరూపించుకున్న హార్దిక్ అదే జోరును ఇక్కడా కొనసాగించాడు. వచ్చీ రాగానే స్పిన్నర్ కేశవ్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. తర్వాతి ఓవర్లో సిక్స్‌తో స్కోరు వంద దాటించిన అక్షర్ వెనుదిరిగినా.. పాండ్యా తన పవర్ హిట్టింగ్ కొనసాగించాడు. అన్రిచ్ ఓవర్లో హార్దిక్, ఎంగిడి బౌలింగ్‌లో శివం దూబే (11) చెరో రెండు ఫోర్లు రాబట్టారు. అయితే, 18 ఓవర్ తొలి బాల్‌కే దూబేను డొనోవాన్ ఫెరీరా బౌల్డ్ చేసి ఆతిథ్య జట్టు జోరుకు బ్రేక్ వేసే ప్రయత్నం చేశాడు.
కానీ, పాండ్యా తగ్గలేదు. సిపామ్ల బౌలింగ్‌లో 6. 4తో విజృంభించగా.. జితేష్ శర్మ (10 నాటౌట్) కూడా సిక్స్ బాదడంతో 19వ ఓవర్లో 18 రన్స్ వచ్చాయి. అన్రిచ్ వేసిన లాస్ట్ ఓవర్లో థర్డ్ మ్యాన్ దిశగా ర్యాంప్ షాట్‌తో సిక్స్ కొట్టి ఫిఫ్టీ (25 బాల్స్) దాటిన పాండ్యా మరో ఫోర్‌తో ఇన్నింగ్స్‌కు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. పాండ్యా దూకుడుతో ఇండియా చివరి 5 ఓవర్లలో 53 రన్స్ రాబట్టింది.
సఫారీలు ఢమాల్
ఇండియా బౌలర్లు కట్టుదిట్టమైన బాల్స్ వేయడంతో టార్గెట్ ఛేజింగ్‌లో సౌతాఫ్రికా ఆది నుంచే తడబడింది. ఏ దశలోనూ ఆతిథ్య జట్టుకు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఇన్నింగ్స్ రెండో బాల్‌కే డికాక్ (0)ను డకౌట్ చేసిన అర్ష్‌దీప్ సఫారీలకు షాకిచ్చాడు. తన తర్వాతి ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్ (14)ను కూడా పెవిలియన్ చేర్చాడు. బుమ్రా బౌలింగ్‌లో కెప్టెన్ మార్‌క్రమ్ (14), స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఓవర్లో డెవాల్డ్ బ్రెవిస్ చెరో ఫోర్, సిక్స్‌తో దూకుడు మీద కనిపించారు.
కానీ, ఆరో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన అక్షర్ తన తొలి బాల్‌కే మార్‌క్రమ్‌ను బౌల్డ్ చేయగా.. ఏడో ఓవర్లో బాల్ అందుకున్న పాండ్యా.. మిల్లర్ (1) పని పట్టాడు. ఆ వెంటనే చక్రవర్తి బౌలింగ్‌లో డొనోవార్ ఫెరీరా (5) ఔటవ్వడంతో 50/5తో సౌతాఫ్రికా కష్టాల్లో పడింది. రెండు సిక్సర్లు కొట్టిన యాన్సెన్ (12)ను చక్రవర్తి పెవిలియన్ చేర్చగా.. ఒంటరి పోరాటం చేస్తున్న బ్రెవిస్‌తో పాటు కేశవ్ మహారాజ్ (0)ను బుమ్రా వెనక్కుపంపాడు. అక్షర్ బౌలింగ్‌లో అన్రిచ్ (1) బౌల్డ్ అవ్వగా.. సిపామ్లా (2)ను ఔట్ చేసిన దూబే మ్యాచ్ ముగించాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 175/6 (హార్దిక్ 59 నాటౌట్, తిలక్ 26, ఎంగిడి 3/31, సిపామ్ల 2/38)
సౌతాఫ్రికా: 12.3 ఓవర్లలో 74 ఆలౌట్ (బ్రెవిస్ 22, మార్‌క్రమ్ 14, అర్ష్‌దీప్ 2/14, బుమ్రా 2/17).
1 మూడు ఫార్మాట్లలోనూ
100 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్ బుమ్రా
