ఐపీఓలతో రూ.1.65 లక్షల కోట్ల సేకరణ 

ఐపీఓలతో రూ.1.65 లక్షల కోట్ల సేకరణ 
  • 11 నెలల్లో 99 కంపెనీల ఐపీఓలు
  • ఎస్ఎంఈ విభాగంలో తగ్గిన పబ్లిక్​ ఇష్యూలు
  • ఎన్​ఎస్​ఈ రిపోర్ట్​ వెల్లడి

ముంబై: భారత ఐపీఓ మార్కెట్ 2026 ఆర్థిక సంవత్సరంలో తిరుగులేని వేగంతో దూసుకుపోతోంది. ఎన్​ఎస్​ఈ విడుదల చేసిన మార్కెట్ పల్స్ రిపోర్ట్​ ప్రకారం... గత ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మెయిన్ బోర్డు విభాగంలో 99 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి రూ.1.65 లక్షల కోట్లు సమీకరించాయి. గత ఆర్థిక సంవత్సరంలో 79 కంపెనీలు రూ.1.62 లక్షల కోట్లను సేకరించాయి. పెద్ద పబ్లిక్ ఇష్యూలపై ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఉన్నారని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 

మెయిన్​బోర్డులో జోరు కనిపిస్తున్నప్పటికీ చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎస్ఎంఈ)  ఐపీఓలు తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 105 ఎస్ఎంఈ ఐపీఓలు రూ.5,121 కోట్లు సేకరించాయి. గత ఏడాది 163 ఐపీఓల ద్వారా రూ.ఏడు వేల కోట్లకు పైగా నిధులు అందాయి. అయితే ఎస్ఎంఈ ఐపీఓల సగటు పరిమాణం గణనీయంగా పెరిగింది. 2020 ఆర్థిక సంవత్సరంలో రూ.13 కోట్లుగా ఉన్న సగటు ఇష్యూ సైజు ప్రస్తుతం రూ.50 కోట్లకు చేరింది.  

ఫైనాన్షియల్ కంపెనీల వాటా 34 శాతం

రంగాల వారీగా చూస్తే మెయిన్ బోర్డులో ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు 34 శాతం నిధులతో మొదటిస్థానంలో నిలిచాయి. కన్స్యూమర్ డిస్క్రిషనరీ కంపెనీలు 31 శాతంతో తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఎస్ఎంఈ విభాగంలో మాత్రం ఇండస్ట్రియల్స్ రంగం 36 శాతం వాటాతో ముందు వరుసలో నిలిచింది. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రకు చెందిన కంపెనీలు అత్యధికంగా రూ.5,830 కోట్లు సేకరించాయి.

గుజరాత్ కంపెనీలు రూ.4,794 కోట్లు, ఢిల్లీ సంస్థలు రూ.3,643 కోట్లు సమీకరించాయి. లిస్టెడ్ ఎస్ఎంఈ కంపెనీల మార్కెట్ విలువలో కూడా మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతోంది. లిస్టింగ్స్ సంఖ్య తగ్గినా, ఇష్యూ పరిమాణం పెరగడం మార్కెట్ బలాన్ని చాటుతోందని ఎన్​ఎస్​ఈ రిపోర్ట్​తెలిపింది.