ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ములపొదిలోకి మరోసారి అజేయమైన రాఫెల్ యుద్ధ విమానాలు చేరబోతున్నాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 114 మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. ఫ్రాన్స్ ప్రభుత్వానికి పంపాల్సిన అధికారిక అభ్యర్థన లేఖను రక్షణ శాఖ సిద్ధం చేసింది. వచ్చే కొన్ని వారాల్లోనే దీనిని ఫ్రాన్స్‌కు పంపించనున్నారు. దాదాపు రూ.3లక్షల 25వేల కోట్ల అంచనా వ్యయంతో జరగబోయే ఈ భారీ రక్షణ ఒప్పందం దేశ చరిత్రలోనే అతిపెద్ద రక్షణ డీల్‌గా నిలవనుంది.
ఈ మెగా డీల్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం మేక్ ఇన్ ఇండియా భాగస్వామ్యం. మొత్తం 114 రాఫెల్ విమానాల్లో దాదాపు 90 విమానాలను ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ ఒక భారతీయ కంపెనీతో కలిసి ఇక్కడే తయారు చేయనుంది. మిగిలిన విమానాలు నేరుగా ఫ్రాన్స్ నుంచి ఎగిరివచ్చే స్థితిలో అందుతాయి. ఈ విమానాల్లో భారతీయ సాంకేతికత వాటా దాదాపు 50 శాతంగా ఉండబోతోంది. అంతేకాకుండా భారతదేశానికి చెందిన అస్త్ర క్షిపణులు, బ్రహ్మోస్-ఎన్జీ వంటి స్వదేశీ ఆయుధాలను రాఫెల్ విమానాలకు అనుసంధానించేందుకు వీలుగా కీలకమైన ఇంటర్ఫేస్ కంట్రోల్ డాక్యుమెంట్ల యాక్సెస్‌పై కూడా భారత్ చర్చలు జరుపుతోంది.
భారత వాయుసేన బలాన్ని పెంచేందుకు ఈ ఒప్పందం ఎంతో కీలకం కానుంది. ప్రస్తుతం వైమానిక దళానికి మంజూరైన 42 స్క్వాడ్రన్ల స్థానంలో కేవలం 29 స్క్వాడ్రన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారత్ ఇప్పటికే 36 రాఫెల్ విమానాలను విజయవంతంగా నడుపుతోంది. అలాగే నేవీ కోసం మరో 26 రాఫెల్ మెరైన్ విమానాల కొనుగోలు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇప్పటికే రాఫెల్ మౌలిక సదుపాయాలు, శిక్షణ వ్యవస్థలు అందుబాటులో ఉండటం వల్ల, కొత్తగా వచ్చే విమానాల నిర్వహణ శిక్షణ ఖర్చులు భారీగా తగ్గుతాయని రక్షణ అధికారులు భావిస్తున్నారు.
స్వదేశీ సాంకేతికతతో తయారవుతున్న హెచ్ఏఎల్ తేజస్ మార్క్ 1A, ఎల్సీఏ మార్క్ 2, 5వ తరం అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ విమానాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది. ముఖ్యంగా ఏఎమ్సీఏ ప్రాజెక్ట్ 2035 తర్వాతే సేవలందిస్తుంది. ఈ లోగా ఏర్పడే రక్షణ లోటును భర్తీ చేయడానికి ఈ 114 రాఫెల్ విమానాలు సరిహద్దుల్లో వ్యూహాత్మక రక్షణ కవచంగా నిలవనున్నాయి. ఈ ఏడాది చివరికల్లా కేంద్ర కేబినెట్ రక్షణ కమిటీ ఆమోదంతో ఫైనల్ కాంట్రాక్ట్‌పై సంతకాలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
