IND vs SA: రిషబ్ పంత్ వచ్చేశాడు.. సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు ఇండియా స్క్వాడ్ ప్రకటన

IND vs SA: రిషబ్ పంత్ వచ్చేశాడు.. సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు ఇండియా స్క్వాడ్ ప్రకటన

స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు టీమిండియా స్క్వాడ్ వచ్చేసింది. సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన 15 మంది సభ్యుల ల జట్టును బీసీసీఐ బుధవారం (నవంబర్ 5) ప్రకటించింది. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్ సిరీస్ లో గాయపడిన పంత్  గాయం కారణంగా ఇటీవలే వెస్టిండీస్ తో స్వదేశంలో జరిగిన రెండు మ్యాచ్ ల  టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న పంత్ వైస్ కెప్టెన్ గా తిరిగి భారత జట్టులోకి వచ్చాడు.  భారత టెస్ట్ జట్టుకు శుభమాన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. 

వెస్టిండీస్ సిరీస్‌లో ఆకట్టుకున్న ధ్రువ్ జురెల్ రిజర్వ్ వికెట్ కీపర్ గా ఎంపికయ్యాడు. విండీస్ సిరీస్ లో ఒక్క ఛాన్స్ కూడా రాని దేవదత్ పడిక్కల్ ను కొనసాగించారు. దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా ఆడుతున్న కరుణ్ నాయర్ కు మరోసారి నిరాశే మిగిలింది. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ కు కూడా జట్టులో చోటు దక్కలేదు. గాయంతో విండీస్ సిరీస్ కు దూరమైన ఆకాష్ దీప్ స్క్వాడ్ లో చోటు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న ఇండియా త్వరలోనే ఇండియాకు రానుంది.      

సౌతాఫ్రికాతో మూడు ఫార్మాట్ లు:  

నవంబర్- డిసెంబర్ నెలలో సౌతాఫ్రికా ఇండియాలో పర్యటిస్తుంది. మూడు ఫార్మాట్ లలో టీమిండియా.. సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ సుదీర్ఘ టూర్ లో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. నవంబర్ 14 నుంచి 18 వరకు తొలి టెస్ట్  న్యూఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో.. నవంబర్ 22 నుంచి 26 వరకు గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియంలో రెండో టెస్ట్ జరుగుతుంది. నవంబర్ 30 న తొలి వన్డే.. డిసెంబర్ 3 న రెండో వన్డే.. డిసెంబర్ 6 న మూడో వన్డే జరుగుతుంది. 

సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు ఇండియా జట్టు:
 
శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్