ఇండిగో సంక్షోభం.. ప్రయాణికుల గోస.. దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా విమానాలు రద్దు

ఇండిగో సంక్షోభం.. ప్రయాణికుల గోస.. దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా విమానాలు రద్దు
  • ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుల్లోనే వేలాది మంది ప్యాసింజర్ల పడిగాపులు
  •     క్షమాపణలు చెప్పిన ఇండిగో.. రీఫండ్ ఇస్తామని ప్రకటన
  •     పైలెట్ల డ్యూటీ రూల్స్‌‌‌‌ను సడలించిన డీజీసీఏ 
  •     విచారణకు కేంద్రం ఆదేశం.. నలుగురు సభ్యులతో కమిటీ
  •     నేడూ వెయ్యి లోపు విమానాలు రద్దయ్యే అవకాశం 
  •     డిసెంబర్ 15లోపు పూర్తి స్థాయిలో సర్వీసులను పునరుద్ధరిస్తామన్న ఇండిగో సీఈవో   

న్యూఢిల్లీ: 
ఇండిగో విమానాల రద్దు కొనసాగుతున్నది. వరుసగా నాలుగో రోజు శుక్రవారం కూడా పెద్ద ఎత్తున ఫ్లైట్లను ఆ సంస్థ క్యాన్సిల్ చేసింది. దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా విమానాలను రద్దు చేసింది. మరికొన్నింటిని ఆలస్యంగా నడిపింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్లైట్ల కోసం ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుల్లో గంటలకొద్దీ పడిగాపులు కాస్తున్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌‌‌‌ తదితర ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుల్లో వేలాది మంది ప్యాసింజర్లు వేచి చూస్తున్నారు. ఇండిగో తీరును నిరసిస్తూ కొన్నిచోట్ల ఆందోళనలు చేపట్టారు.

శుక్రవారం ఢిల్లీ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు నుంచి వెళ్లాల్సిన అన్ని విమానాలను ఇండిగో రద్దు చేసింది. దాదాపు 235 ఫ్లైట్లను క్యాన్సిల్ చేసింది. అలాగే చెన్నై ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు నుంచి కూడా బయలుదేరాల్సిన ఫ్లైట్లన్నింటినీ రద్దు చేసింది. ఇక ముంబైలో 104, బెంగళూరులో 102, గుజరాత్‌‌‌‌లో 100కు పైగా, హైదరాబాద్‌‌‌‌లో 92, జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో 40కి పైగా, గోవాలో 31 విమానాలను క్యాన్సిల్ చేసింది. కాగా, మన దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీ అయిన ఇండిగో.. ప్రతిరోజు 2,300 డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్లు నడుపుతుంది. అయితే పైలెట్ల డ్యూటీ రూల్స్‌‌‌‌ను మారుస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశాలు ఇవ్వడం, అందుకు అనుగుణంగా ఇండిగో ప్లాన్ చేయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. మంగళవారం 100కు పైగా, బుధవారం 200కు పైగా, గురువారం 500కు పైగా విమానాలను ఇండిగో రద్దు చేసింది. 

నిబంధనలు సడలింపు.. 

ఇండిగో సంక్షోభం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ సంస్థలకు ఊరటనిస్తూ గతంలో మార్చిన నిబంధనలను తాత్కాలికంగా సడలించింది. ఒక వారంలో పైలెట్లకు ఇచ్చే రెస్ట్ టైమ్‌‌‌‌ను 36 గంటల నుంచి 48 గంటలకు పెంచిన డీజీసీఏ.. వీక్లీ రెస్ట్‌‌‌‌ను సెలవుగా పరిగణించవద్దని గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పుడు దాన్ని సెలవుగా పరిగణించవచ్చని ప్రకటించింది. అలాగే పైలెట్లు వరుసగా రెండు కంటే ఎక్కువ నైట్‌‌‌‌ షిఫ్ట్‌‌‌‌లు చేయకూడదనే నిబంధనను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. ఈ మినహాయింపులు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు అమల్లో ఉంటాయని, ప్రతి 15 రోజులకోసారి సమీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. 

ప్యాసింజర్లకు రీఫండ్.. 

విమాన సర్వీసుల్లో అంతరాయంపై ఇండిగో విచారం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా ‘ఎక్స్‌‌‌‌’లో పోస్టు పెట్టింది. ‘‘ఇది రాత్రికి రాత్రే పరిష్కారమయ్యే సమస్య కాదు. సమస్యను పరిష్కరించేందుకు మేం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మా కార్యకలాపాలను సులభతరం చేయడానికి, ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుల్లో రద్దీని తగ్గించడానికి ముందస్తు చర్యలు చేపట్టాం” అని అందులో పేర్కొంది. అలాగే ప్రయాణికులకు రీఫండ్ ఇస్తామని ప్రకటించింది. ఈ నెల 5 నుంచి 15 మధ్య టికెట్లు బుక్ చేసుకుని, ఫ్లైట్లు రద్దయిన ప్రయాణికులు పూర్తి రీఫండ్ పొందవచ్చని.. లేదంటే వేరే ఫ్లైట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది.  

మూడ్రోజుల్లో పునరుద్ధరిస్తం: కేంద్ర మంత్రి

ఇండిగో సమస్యను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమాన సర్వీసులను మూడ్రోజుల్లో పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని చెప్పారు. డీజీసీఏ మార్పులు చేసిన ‘ది ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్‌‌‌‌డీటీఎల్)’ రూల్స్‌‌‌‌ అమలును నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు ఇండిగో సంక్షోభంపై దర్యాప్తుకు కేంద్రం ఆదేశించింది. ఇందుకోసం నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో డీజీసీఏ జాయింట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ జనరల్ సంజయ్‌‌‌‌ కె.బ్రహ్మనే, డిప్యూటీ డైరెక్టర్‌‌‌‌ జనరల్‌‌‌‌ అమిత్‌‌‌‌ గుప్తా, సీనియర్‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌ ఆపరేషన్స్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ కపిల్‌‌‌‌ మాంగ్లిక్‌‌‌‌, ఫ్లైట్‌‌‌‌ ఆపరేషన్స్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌ లోకేశ్ రాంపాల్‌‌‌‌ ఉన్నారు. 

నేడు వెయ్యిలోపు ఫ్లైట్లు రద్దు!: ఇండిగో సీఈవో  

విమానాల సర్వీసుల్లో జరుగుతున్న అంతరాయానికి క్షమించాలని ప్రయాణికులను ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ కోరారు. ‘‘గత కొన్ని రోజులుగా మేం తీసుకుంటున్న చర్యలతో సమస్య పరిష్కారం కావడం లేదని అర్థమైంది. అందుకే మా సిస్టమ్స్, షెడ్యూల్స్‌‌‌‌ను మొత్తం రీబూట్ చేయాలని నిర్ణయించాం. ఫలితంగానే ఈ రోజు పెద్ద ఎత్తున ఫ్లైట్స్ రద్దయ్యాయి. కానీ రేపటి నుంచి పరిస్థితులు మెరుగుపడతాయి. రేపు వెయ్యి లోపు విమానాలు రద్దవుతాయని అంచనా వేస్తున్నాం. ఈ నెల 10 నుంచి 15 మధ్య పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని అనుకుంటున్నాం” అని శుక్రవారం వీడియో మెసేజ్‌‌‌‌లో ఆయన పేర్కొన్నారు.

ఢిల్లీ నుంచి ముంబైకి 20 వేలా.. 

ఇండిగో విమానాల రద్దు కారణంగా ఫ్లైట్ టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ప్రయాణికులు ఇతర ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీల విమానాల్లో బుక్ చేసుకుంటుండడంతో డిమాండ్ పెరిగి, సాధారణ రోజులతో పోలిస్తే ధరలు రెండు, మూడింతలు అధికమయ్యాయి. సాధారణంగా ఢిల్లీ టు ముంబై రౌండ్ ట్రిప్ ధర రూ.20 వేలు ఉంటుంది. కానీ ఇప్పుడది రూ.60 వేలు అయింది. ఢిల్లీ టు కోల్‌‌‌‌కతా రౌండ్ ట్రిప్ ధర ఏకంగా రూ.85 వేలు ఉంది. ఇది ఢిల్లీ టు లండన్, ఢిల్లీ టు పారిస్ రౌండ్ ట్రిప్ ధర రూ.60 వేల కంటే ఎక్కువ. ఇక ఢిల్లీ నుంచి హైదరాబాద్‌‌‌‌కు సాధారణ రోజుల్లో రూ.7 వేలు అయితే, ఇప్పుడది రూ.48 వేలు ఉన్నది. ఈ టికెట్ల ధర డిమాండ్‌‌‌‌ను ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నది.