గాల్లో ఉండగానే ఇంజిన్‌ ఫెయిల్‌.. ఇండిగో విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం

గాల్లో ఉండగానే ఇంజిన్‌ ఫెయిల్‌.. ఇండిగో విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం

ముంబై: ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. గాల్లో ఉండగానే ఫ్లైట్ ఇంజిన్ ఫెయిల్ అయ్యింది. వెంటనే అప్రమత్తమైన పైలట్.. ప్యాన్ ప్యాన్ ప్యాన్ (ప్రాణాపాయం లేదు కానీ ఎమర్జెన్సీగా ల్యాండ్ కావాలని పైలట్ పంపే సందేశం) అంటూ ఏటీసీకి సిగ్నల్ ఇచ్చాడు. ఏటీసీ నుంచి  క్లియరెన్స్ రావడంతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పినట్లైంది. 

ఈ ఘటన బుధవారం (జూలై 16) రాత్రి జరిగింది. ఈ సమయంలో విమానంలో  191 ప్రయాణికులు ఉన్నారు. విమానం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గోవా బయలుదేరింది. కానీ గాల్లో ఉండగానే ఇంజిన్ ఫెయిల్ కావడంతో ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం ఒడిషా రాజధాని భువనేశ్వర్‌కు ఉత్తరాన 100 నాటికల్ మైళ్ల దూరంలో ఎగురుతున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని ముంబై విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఫ్లైట్ ఇంజిన్ నంబర్ 1లో సాంకేతిక లోపం తలెత్తిందని తెలిపారు. 

ఈ ఘటనపై ఇండిగో ఎయిర్ లైన్స్ స్పందించింది. సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని అత్యవసరంగా ముంబైకి మళ్లించాల్సి వచ్చిందనితెలిపింది. జూలై 16న ఢిల్లీ నుంచి గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తోన్న 6E 6271 విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని.. దీంతో వెంటనే విమానాన్ని ముంబై ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశామని పేర్కొంది. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేశామని.. ప్రయాణికులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని ఇండియా ఎయిర్ లైన్స్ తెలిపింది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపానికి కారణమేంటనే దానిపై నిపుణులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది.