
- సందడి చేసిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు
- ఇందిరా మహిళా శక్తి బజార్ సందర్శన
- ఇది బజార్ కాదు.. శక్తి కేంద్రం: సీతక్క
హైదరాబాద్, వెలుగు: మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు గురువారం హైదరాబాద్‌లోని శిల్పారామంలో సందడి చేశారు. ఇందిరా మహిళా శక్తి బజార్‌ను సందర్శించి, స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఆయా స్టాళ్లలోని ఉత్పత్తులపై ఆరా తీశారు. మహిళలతో మాట్లాడి వాళ్ల కష్టసుఖాలు, విజయాలు తెలుసుకున్నారు. ఇందిరా మహిళా శక్తి పాలసీ ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్న తీరును కంటెస్టెంట్లకు మంత్రి సీతక్క వివరించారు.
మహిళా సంఘాలకు ఏటా రూ.20 వేల కోట్లకు పైగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నామని చెప్పారు. వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ అద్దె బస్సులు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ మహిళలు ప్రగతిపథంలో పయనిస్తున్నారని వెల్లడించారు. మహిళా సాధికారతపై ప్రచారం చేయాలని కంటెస్టెంట్లను సీతక్క కోరారు. సెర్ప్ ఉద్దేశాలు, లక్ష్యాలను కంటెస్టెంట్లకు సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్ వివరించారు. మహిళా సంఘాలు సాధించిన ప్రగతిపై డాక్యుమెంటరీ ప్రదర్శించారు. కాగా, మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులను కంటెస్టెంట్లకు బహూకరించారు. పలువురు ముద్దుగుమ్మలు మట్టి కుండలు చేస్తూ సందడి చేశారు.
కోటి మందిని కోటీశ్వరులను చేస్తం: సీతక్క
ఇది సాధారణ బజార్ కాదని, శక్తికి కేంద్రమని మంత్రి సీతక్క అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తున్నదని చెప్పారు. ఆర్థిక స్వేచ్ఛతోనే మహిళలకు నిజమైన స్వాతంత్ర్యమని, దాన్ని ఇందిరా మహిళా శక్తి బజార్ నిజం చేస్తున్నదని తెలిపారు. సామాజిక మార్పు కోసం ఇందిరా మహిళా శక్తి బజార్ పని చేస్తున్నదని, తెలంగాణ మహిళలు చరిత్రను తిరగరాస్తున్నారని పేర్కొన్నారు. 46 లక్షల మంది మహిళలు వడ్డీ లేని రుణాలతో వ్యాపారాలు చేస్తూ సంపద సృష్టిస్తున్నారని తెలిపారు.