ప్రతీ గ్రామంలో ఐదారుగురు సభ్యులతో ఇందిరమ్మ కమిటీలు..

ప్రతీ గ్రామంలో ఐదారుగురు సభ్యులతో ఇందిరమ్మ కమిటీలు..
  • స్కీమ్స్​ ప్రజలకు అందేలా చూసుకునే బాధ్యత కమిటీలకు!
  • త్వరలోనే నామినేటెడ్ పదవులు.. లిస్ట్ రెడీ చేస్తున్న ఏఐసీసీ
  • సోనియా గాంధీని రాష్ట్రం నుంచి పోటీ చేయించేలా తీర్మానం

హైదరాబాద్, వెలుగు: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పార్టీ తరఫున వారధిగా పని చేసేందుకు ‘ఇందిరమ్మ కమిటీలను’ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయనుంది. ప్రతి గ్రామంలో ఐదారుగురు సభ్యులతో ఈ కమిటీలను నియమించాలని నిర్ణయించింది. మహిళలు, సామాజిక వర్గాల సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని సభ్యులను నియమించనున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ఆరు గ్యారంటీల అమలు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూసుకునే బాధ్యతలను ఇందిరమ్మ కమిటీలకు అప్పగిస్తారని చెప్పారు. మరోవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీపై పార్టీ పెద్దలు, ఏఐసీసీ సెక్రటరీలు, ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌లు లిస్టును తయారు చేస్తున్నట్టు తెలిపారు. బుధవారం గాంధీభవన్‌‌‌‌‌‌‌‌లో పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీసీసీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, రాష్ట్రానికి పార్టీ కొత్త ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగా దీపాదాస్ మున్షి నియామకమయ్యాక జరిగిన తొలి మీటింగ్ ఇది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, పీసీసీ వైస్ ప్రెసిడెంట్లు, పార్టీ అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం పాస్ చేశారు. సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని.. రాష్ట్రానికి పార్టీ ఇన్​చార్జిగా సేవలందించిన మాణిక్ రావు ఠాక్రేకి ధన్యవాదాలు తెలుపుతూ.. కొత్త ఇన్​చార్జిగా వచ్చిన దీపాదాస్ మున్షికి స్వాగతం పలుకుతూ.. మూడు తీర్మానాలను సీఎం రేవంత్ ప్రవేశపెట్టగా నేతలంతా ఆమోదించారు.

కష్టపడి పనిచేసినోళ్లకు పదవులు ఖాయం

అతి త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలుస్తున్నది. కష్టపడి పనిచేసినోళ్లకు పదవులు ఖాయంగా వస్తాయని చెప్పినట్టు సమాచారం. ‘‘మేము ఇయ్యాల బుగ్గ కార్లల్ల తిరగడానికి కారణం.. పార్టీ కేడరే. వారికి న్యాయం చేస్తాం. పదవుల కోసం మంత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కష్టపడి పనిచేసిన వారికి ఇంటి వద్దకే పదవులు వస్తాయి” అని భరోసా ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పార్టీ కోసం పనిచేసిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, షాద్​నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, ఖానాపూర్​ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వంటి వారికి ఎమ్మెల్యే పదవులు వచ్చినట్టే.. మిగతా వారికీ తప్పకుండా పదవులు దక్కుతాయని చెప్పినట్టు సమాచారం. ప్రభుత్వ పథకాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్టు తెలుస్తున్నది. సంక్రాంతికి ముందు లేదా తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీ ఉండొచ్చని, లేదంటే ఈనెల చివరి వారం నాటికి భర్తీ చేసే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. సమావేశంలో పలువురు నేతలు.. పలు కమిషన్ల చైర్​పర్సన్ల నియామకం గురించి సీఎం రేవంత్ సహా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది.

లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలపై సమీక్షలు :  మల్లు రవి

లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 8, 9 తేదీల్లో ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశం నిర్వహిస్తామని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి వెల్లడించారు. 11, 12, 13వ తేదీల్లో పార్లమెంట్​నియోజకవర్గ ఇన్​చార్జ్ మంత్రులు, జిల్లాల నేతలు సమావేశమవుతారని తెలిపారు. 14న పెట్టుబడులను ఆహ్వానించేందుకు దావోస్​కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్​బాబు వెళ్తున్నారని, నాలుగు రోజులు అక్కడే ఉంటారని చెప్పారు. వచ్చిన తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు ఉంటాయని వివరించారు. పీసీసీ విస్తృత స్థాయి సమావేశం తర్వాత పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్​ కుమార్ రెడ్డితో కలిసి గాంధీభవన్​లో మీడియాతో మల్లు రవి మాట్లాడారు. ఏఐసీసీ ఇన్​చార్జిలు, సెక్రటరీలు నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి లిస్ట్​ను తయారు చేస్తున్నట్టు చెప్పారు.

టార్గెట్ 15 సీట్లు

లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ స్థానాలను గెలిచే దిశగా కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కనీసం 12 నుంచి 15 స్థానాల్లో గెలిచేలా పనిచేయాలని పార్టీ కేడర్​కు సీఎం రేవంత్, మంత్రులు దిశా నిర్దేశం చేసినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు జిల్లాలు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా త్వరలోనే సమావేశాలను నిర్వహించేందుకు యోచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే జిల్లాలకు ఇన్​చార్జి మంత్రులను, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్​చార్జిలను నియమించిన సంగతి తెలిసిందే. వారి ఆధ్వర్యంలోనే ఈ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశాలను నిర్వహించనున్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు.