
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- రసూల్పురలో లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల అందజేత
పద్మారావునగర్, వెలుగు: గ్రేటర్‌పరిధిలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద త్వరలో ఇండ్లు మంజూరు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు అపార్ట్ మెంట్ తరహా ఇండ్లను కట్టించేలా తీయటి కబురు త్వరలో చెబుతామన్నారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రసూల్ పురలో నిర్మించిన 344 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీగణేశ్ కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో 30 నుంచి70 గజాలున్నా సరే స్థానికంగా నివసించే వారికి అపార్ట్ మెంట్ తరహాలో ఇండ్లను నిర్మిస్తామని స్పష్టం చేశారు.
ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు రిపేర్లు చేసి త్వరలో పేదలకు కానుకగా అందిస్తామన్నారు. డిప్యూటి మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి, కలెక్టర్ హరిచందన దాసరి, బోర్డు నామినేటేడ్ సభ్యురాలు భానుక నర్మద, మల్లికార్జున్ పాల్గొన్నారు.