- మరో ప్యాకేజీకి ముందుకు రాని కాంట్రాక్టర్లు
- వచ్చే వారం నిర్మాణ పనులు షురూ
హైదరాబాద్, వెలుగు: క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌కు టెండర్లు ఫైనల్ అయ్యాయి. 16 నియోజకవర్గాల టవర్లను 10 ప్యాకేజీలుగా విభజించి అధికారులు టెండర్లు పిలిచారు. ఇందులో 9 ప్యాకేజీలకు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. కాగా, సనత్‌నగర్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో నిర్మించనున్న టవర్లకు కాంట్రాక్టర్లు టెండర్ దాఖలు చేయకపోవడం గమనార్హం. మరో 4 నియోజకవర్గాల్లో ప్రస్తుతం అప్లికేషన్లు తీసుకుంటుండగా వీటితో కలిపి మళ్లీ టెండర్ పిలుస్తామని హౌసింగ్ బోర్డు అధికారులు చెబుతున్నారు.
టెండర్లు ఫైనల్‌పై హౌసింగ్ బోర్డు కమిషనర్ వీపీ గౌతమ్ శనివారం జీవో జారీ చేశారు. 1, 2, 7, 8 ప్యాకేజీలు సీహెచ్ గౌరి శంకర్ ఇన్‌ఫ్రా బిల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. 3, 5, 6 ప్యాకేజీలు జీఆర్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్, 4, 9 ప్యాకేజీలు సాధన గృహ నిర్మాణ్ కంపెనీ దక్కించుకుంది. కాగా, ఈ నెల 31తో లబ్ధిదారుల ఎంపిక పూర్తి కానుండగా, త్వరలో నియోజకవర్గాల వారీగా కాంట్రాక్టర్లను, ఫ్లాట్ దక్కిన లబ్ధిదారులతో హౌసింగ్ బోర్డు అధికారులు మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. హౌసింగ్ బోర్డు నుంచి ఎల్‌వోఏ (లెటర్ ఆఫ్ అగ్రిమెంట్) పత్రం తీసుకున్నప్పటి నుంచి ఏడాదిలోగా పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని కాంట్రాక్టర్లకు హౌసింగ్ బోర్డు స్పష్టం చేయనుంది.
