హైదరాబాద్, వెలుగు: మూడు రోజుల పాటు జరిగే ‘ఇండోమాచ్ హైదరాబాద్ 2026’ ఎక్స్‌పో శుక్రవారం ప్రారంభమైంది. ఈ నెల 14 వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు ఓపెన్‌లో ఉంటుంది. ప్రవేశం ఉచితం. ఇండోమాచ్ బిజినెస్ సొల్యూషన్స్ నిర్వహిస్తున్న ఈ ఐదో ఎడిషన్‌లో దేశవ్యాప్తంగా 100కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని ఆటోమేషన్, సీఎన్‌సీ మెషీన్లు, హ్యాండ్ టూల్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలను ప్రదర్శిస్తున్నాయి.
తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కె. సుధీర్ రెడ్డి, తపారియా టూల్స్ జీఎం బి. పిళ్ళై, ఇండోమాచ్ డైరెక్టర్ మనీష్ సిన్హా తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వేగంగా ఎదుగుతున్న హైదరాబాద్ పారిశ్రామిక రంగానికి, ముఖ్యంగా 20 వేల ఎంఎస్ఎమ్‌ఈలు తమ నెట్‌వర్క్‌ను పెంచుకోవడానికి ఇదొక అద్భుత వేదికని వారు పేర్కొన్నారు. ఈ ఎక్స్‌పో ద్వారా దాదాపు రూ. 400 కోట్లకు పైగా వ్యాపార అవకాశాలు లభిస్తాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
