ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌ డీజిల్పై రూ.22 పెంపు..సాధారణ పెట్రోల్, డీజిల్‌‌‌‌‌‌‌‌ రేట్లు యథాతథం

ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌ డీజిల్పై రూ.22 పెంపు..సాధారణ పెట్రోల్, డీజిల్‌‌‌‌‌‌‌‌ రేట్లు యథాతథం
  • ప్రీమియం పెట్రోల్‌‌‌‌‌‌‌‌ ధర రూ.2 హైక్​
  • సాధారణ పెట్రోల్, డీజిల్‌‌‌‌‌‌‌‌ రేట్లు యథాతథం
  • హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటన
  • సవరించిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి
  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఎఫెక్ట్​ 
  • అంతర్జాతీయంగా క్రూడ్‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌ ధర పెరగడంతో పెంపు నిర్ణయం

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ప్రభావంతో చమురు ధరలు భారీగా పెరగ్గా, దేశంలోని చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రీమియం పెట్రోల్‌‌ ధర లీటర్‌‌కు రూ.2.35 పెంచాయి. అలాగే,  పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే బల్క్ డీజిల్ ధరను ఏకంగా రూ. 22 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు శుక్రవారం  హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌‌పీసీఎల్) ప్రకటన విడుదల చేసింది.

బీపీసీఎల్‌‌ స్పీడ్‌‌, ఐవోసీఎల్‌‌ ఎక్స్‌‌పీ95 ప్రీమియం పెట్రోల్‌‌ ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. పెట్రోలియం సంస్థలు ప్రాంతాన్ని బట్టి ప్రీమియం పెట్రోల్‌‌ ధరలను లీటర్‌‌‌‌కు రూ.2.09 నుంచి రూ.2.35 వరకూ పెంచాయి. సవరించిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే, సామాన్యుడు వాడే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉంటాయని హెచ్‌‌పీసీఎల్‌‌ పేర్కొన్నది.  పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. 

ఢిల్లీలో పెరిగిన ధరలు ఇలా..

తాజా పెంపుతో ఢిల్లీలో 95- ఆక్టేన్ కలిగిన ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ. 99.89 నుంచి రూ. 101.89కి చేరింది. అలాగే, ఇండస్ట్రియల్ డీజిల్ ధర లీటరుకు రూ. 87.67 నుంచి రూ. 109.59కి పెరిగింది. సాధారణ పెట్రోల్ ధర రూ. 94.77, డీజిల్ ధర రూ. 87.67 వద్దే స్థిరంగా కొనసాగుతున్నాయి.

సామాన్యుడిపై భారం లేదు: కేంద్రం 

ఈ ధరల పెంపుపై పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ స్పందించారు. ‘‘సాధారణ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి పెంపు లేదు. కేవలం 2 నుంచి 4 శాతం మంది మాత్రమే వాడే ప్రీమియం కేటగిరీలో స్వల్ప మార్పు జరిగింది. సామాన్య ప్రజానీకంపై దీని ప్రభావం ఉండదు’’ అని ఆమె స్పష్టం చేశారు.

వినియోగదారులందరికీ ఇంధనాన్ని అందుబాటులో ఉంచడమే తమ  ప్రాధాన్యత అని, ఈ సంక్షోభం అంతటా తాము అదే చేస్తున్నామని, ఇప్పటివరకు తాము ధరలను పెంచలేదని వెల్లడించారు. చమురు సంస్థలే స్వతంత్రంగా ధరలపై నిర్ణయం తీసుకుంటాయని, ప్రభుత్వం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు.