వీడియో: అంపైర్ బతికిపోయాడు.. కోపంతో ఊగిపోయిన టీమిండియా కెప్టెన్‌

వీడియో: అంపైర్ బతికిపోయాడు.. కోపంతో ఊగిపోయిన టీమిండియా కెప్టెన్‌

ఢాకా వేదికగా భార‌త్, బంగ్లాదేశ్ మ‌హిళ‌ల జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన నిర్ణయాత్మక మూడో వ‌న్డే టైగా ముగిసింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావడం, ఆపై వ‌ర్షం అడ్డంకిగా మారడంతో.. అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించకుండానే ఇరు జట్లను సంయుక్త విజేత‌లుగా ప్ర‌క‌టించారు. అయితే.. ఈ మ్యాచ్‌లో అంపైర్ల త‌ప్పిదాలు టీమిండియా విజ‌యావ‌కాశాల్ని దెబ్బ‌తీశాయి. మ్యాచ్ ప్రజెంటేషన్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇదే విషయాన్ని నొక్కి చెప్పింది.

ఈ సిరీస్ నుంచి చాలా నేర్చుకున్నామని చెప్పిన హర్మన్ ప్రీత్.. అంపైర్ల నిర్ణయాలు తమను ఆశ్చర్యపరిచాయని తెలిపింది. తదుపరి బంగ్లా పర్యటనకు వచ్చిటప్పుడు ఈ రకమైన అంపైరింగ్‌తో ఎలా వ్యవహరించాలో సిద్ధమై వస్తామని వెల్లడించింది.

మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు నిర్ణీత ఓవర్లలో 225 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా సరిగ్గా 225 పరుగుల వద్ద ఆలౌటైంది. విజయానికి ఒక పరుగు కావాల్సివున్నప్పుడు టీమిండియా చివరి వికెట్ కోల్పోవటం గమనార్హం.

కోపంతో ఊగిపోయిన హర్మన్‌ప్రీత్

ఈ మ్యాచ్‌లో భారత మహిళా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్‌ కోపంతో ఊగిపోయింది. అంపైర్‌ ఔట్‌ ఇచ్చాడనే కోపంతో వికెట్లను బ్యాట్‌తో కొట్టి నానా రచ్చ చేసింది. భారత ఇన్నింగ్స్‌ 34 ఓవర్‌‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బంగ్లా బౌలర్ నహిదా అక్తర్‌ బౌలింగ్‌లో మూడో బంతిని హర్మన్‌ప్రీత్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి బ్యాట్‌కు మిస్స్‌ అయ్యి ప్యాడ్‌కు తాకింది. ఈ క్రమంలో బంగ్లా ఫీల్డర్లు ఎల్బీడబ్ల్యూకి అప్పీలు చేయగా.. అంపైర్‌ ఔట్‌ అంటూ వేలు పైకెత్తాడు. 

దీంతో చిర్రెత్తుకొచ్చిన హర్మన్‌ ప్రీత్‌.. బ్యాట్‌తో వికెట్లను పడగొట్టి పెవిలియన్‌ దారి పట్టింది. వెళ్తూ వెళ్తూ అంపైర్‌‌ను బండ బూతులు తిట్టినట్లు కథనాలు వస్తున్నాయి. అంతేకాదు.. ఆమె పెవిలియన్‌‌కు వెళ్తున్న సమయంలో బంగ్లా అభిమానులు రెచ్చగొట్టగా వారికి వ్యంగ్యమైన బొటనవేలు చూపడం కనిపించింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.