నారాయణమూర్తి చెప్పింది ఒకటి.. కానీ ఇన్ఫోసిస్ చేస్తోంది మరొకటి.. టెక్కీలకు వార్నింగ్ బెల్..

నారాయణమూర్తి చెప్పింది ఒకటి.. కానీ ఇన్ఫోసిస్ చేస్తోంది మరొకటి.. టెక్కీలకు వార్నింగ్ బెల్..

IT News: దేశంలో టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఇన్ఫోసిస్ కంపెనీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి దేశంలో యువత వారానికి 70 గంటలు పనిచేయాలని, వారంలో ఆరు రోజులు పని ఉండాలని పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన మాత్రం కంపెనీ ఫస్ట్ పర్సనల్ లైఫ్ నెక్స్ట్ అనే ధోరణిని వ్యక్తం చేయటంతో దానిపై టెక్కీలతో పాటు డాక్టర్లు కూడా ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

అయితే మరో పక్క ఎన్ఆర్ నారాయణమూర్తి స్థాపించిన ఇన్ఫోసిస్ సంస్థ మాత్రం ఆయన ఆలోచనలకు దూరంగా ఉంది. తాజాగా టెక్ దిగ్గజం తన ఉద్యోగులతో కొత్త పాలసీని వివరాలను పంచుకుంది. ఇందులో ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులను వాస్తవ వర్కింగ్ గంటల కంటే ఎక్కువ సమయం పని చేయవద్దని కోరింది. ఎక్కువ పనిగంటల ఒత్తిడి ఆరోగ్యాన్ని దెబ్బతీయటమే కాకుండా ఉద్యోగుల వర్క్ లైఫ్  బ్యాలెన్స్ దెబ్బతింటుందని కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని తప్పనిసరిగా పాటించాలని నిర్థేశించిన పనిగంటల్లో మాత్రమే వర్క్ చేయాలని మెయిల్ ద్వారా టెక్కీలకు తెలిపింది. 

ఇందులో భాగంగా కంపెనీ తన ఉద్యోగులు ఉపయోగించే పరికరాల్లో వారు రోజులో 9 గంటల 15 నిమిషాల కంటే ఎక్కువ వర్క్ చేస్తుంటే వారికి వార్నింగ్ పంపించేలా కొత్త అలర్ట్ సిస్టమ్ తీసుకొచ్చింది. ప్రస్తుతం కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా 3లక్షల 24వేల మంది ఉద్యోగులు ఉన్నారు. యువత అధిక పని ఒత్తిడి కారణంగా అనారోగ్యాలకు గురవుతున్నారని వస్తున్న తాజా రిపోర్టులతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

అయితే కంపెనీ ఉద్యోగులకు చేసిన సూచన నారాయణమూర్తి కోరుకున్న వారానికి 70 గంటల పనికి భిన్నంగా ఉండటంపై కొంత చర్చ జరుగుతోంది. మెుత్తానికి కంపెనీ కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ప్రాముఖ్యతను గుర్తించటంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.