ట్రాన్స్​పోర్ట్​ ఫుల్ స్పీడ్

ట్రాన్స్​పోర్ట్​  ఫుల్ స్పీడ్

బడ్జెట్​లో లక్షా 70 వేల కోట్లు కేటాయింపు

 కొత్తగా 15,500 కిలోమీటర్ల హైవేలు

 100 కొత్త ఎయిర్​పోర్టులు

 రాష్ట్రపతి, ప్రధాని కోసం రెండు కొత్త విమానాలు

ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేలా ఇన్​ఫ్రాస్ట్రక్చర్​పై భారీగా ఖర్చు పెట్టనున్నట్టు కేంద్ర ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ బడ్జెట్​ స్పీచ్​లో వెల్లడించారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల ఏర్పాటు కోసం ఏకంగా కోటీ మూడు లక్షల కోట్లు ఖర్చు చేయనున్నామని చెప్పారు. అందులో భాగంగా రవాణా రంగానికి మరింత ఊతమిచ్చేలా బడ్జెట్​లో భారీగా నిధులిస్తున్నట్టు తెలిపారు. రోడ్లు, జల మార్గాలు, ఎయిర్​పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం లక్షా 70 వేల కోట్లు ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. త్వరలోనే నేషనల్​ లాజిస్టిక్స్​ పాలసీని ప్రకటిస్తామన్నారు.

అన్ని రంగాల్లో ఖర్చు..

ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​మెంట్​ కోసం ‘నేషనల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ పైప్​లైన్​ (ఎన్​ఐపీ)’కార్యక్రమాన్ని చేపట్టామని, దాని కింద 6,500కుపైగా ప్రాజెక్టులను చేపడుతున్నట్టు ఫైనాన్స్​ మినిస్టర్​ చెప్పారు. రోడ్లు, రైల్వే మార్గాలు, ఎయిర్​పోర్టులు, విద్యా సంస్థలు, సాంప్రదాయేతర విద్యుత్, ఇండ్లు, మంచినీళ్లు అందించే పథకాలు.. వంటివన్నీ ఆ ప్రాజెక్టుల్లో ఉంటాయన్నారు. పవర్ సెక్టార్‌‌ కోసం రూ.22 వేల కోట్లు కేటాయించామని చెప్పారు.

దేశంలో హైవేల నిర్మాణ వేగాన్ని మరింతగా పెంచుతామని ఫైనాన్స్​ మినిస్టర్​ ప్రకటించారు. కొత్తగా 15,500 కిలోమీటర్ల పొడవునా హైవేల నిర్మాణం చేపడతామని తెలిపారు. అందులో 2,500 కిలోమీటర్ల సాధారణ హైవేలు, 9 వేల కిలోమీటర్ల ఎకనమిక్​ కారిడార్లు, తీర ప్రాంతాల్లో రెండు వేల కిలోమీటర్ల హైవేలు, మరో రెండు వేల కిలోమీటర్ల పొడవునా వ్యూహాత్మక హైవేలు నిర్మిస్తామని చెప్పారు. కేంద్ర రోడ్​ట్రాన్స్​పోర్ట్​ డిపార్ట్​మెంట్​కు గత బడ్జెట్​లో రూ. 83,016 కోట్లు ఇవ్వగా.. ప్రస్తుతం రూ.91,823 కోట్లు కేటాయించారు. ఇక ఢిల్లీ–ముంబై ఎక్స్​ప్రెస్​హైవేను 2023 నాటికల్లా పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. బెంగళూరులో 150 కిలోమీటర్ల సబర్బన్​ ప్రాజెక్టు, చెన్నై–బెంగళూరు ఎక్స్​ప్రెస్​వే నిర్మాణాన్ని చేపడతామని తెలిపారు. నదుల వెంట ఎకనమిక్​ యాక్టివిటీని పెంచేందుకు ‘అర్థ్​గంగా’ ప్రాజెక్టు చేపట్టనున్నట్టు తెలిపారు.

మరిన్ని హైవేలపై ‘టోల్’

నేరుగా ప్రభుత్వ నిధులతో నిర్మించిన హైవేలపై టోల్​ వసూళ్ల హక్కును ప్రైవేటుకు అమ్మేసి నిధులు సమీకరిస్తామని ఫైనాన్స్​ మినిస్టర్​ బడ్జెట్​ స్పీచ్​లో చెప్పారు. నాలుగేళ్లలోగా వివిధ ప్రాంతాల్లోని సుమారు ఆరు వేల కిలోమీటర్ల హైవేలను టెండర్ల ద్వారా అప్పగించేందుకు ‘నేషనల్​ హైవేస్​ అథారిటీ’ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ‘టోల్​ ఆపరేట్​ ట్రాన్స్​ఫర్​ (టీఓటీ)’విధానంలో ఇవ్వనున్నట్టు చెప్పారు. హైవేలపై అమల్లోకి తెచ్చిన ఫాస్టాగ్​ విధానం ద్వారా మరిన్ని నిధులు అందుతాయని చెప్పారు.

సివిల్​ ఏవియేషన్​కు రూ. 3,797 కోట్లు

ఉడాన్​ స్కీమ్​ కింద 2025 నాటికల్లా దేశవ్యాప్తంగా మరో 100 ఎయిర్​పోర్టులు అందుబాటులోకి తీసుకువస్తామని ఫైనాన్స్​ మినిస్టర్​ చెప్పారు. ఇప్పుడున్న 600 సివిల్​ విమానాల సంఖ్యను 1,200కు పెంచుతామని తెలిపారు. బడ్జెట్​లో సివిల్​ ఏవియేషన్​కు రూ. 3,797 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్​లో ఇచ్చిన రూ.3,700 కోట్ల కంటే ఇది రెండున్నర శాతం ఎక్కువ. ఇక రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ప్రయాణించేందుకు రెండు బోయింగ్​ 777 విమానాలను కొనుగోలు చేయనున్నారు. వీటికోసం రూ.810 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం వారు ‘ఎయిరిండియా వన్’గా పిలిచే బోయింగ్​ 747 విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఇక ఉడాన్​ స్కీమ్​కు గత బడ్జెట్​ కంటే మూడు శాతం ఎక్కువగా రూ.465 కోట్లు ఇచ్చారు. నష్టాల్లో ఉన్న ఎయిరిండియాను కాపాడేందుకు ఉద్దేశించిన ‘టర్న్​ ఎరౌండ్​ప్లాన్​ ఫర్​ ఎయిరిండియా’కు కేవలం లక్ష రూపాయలు మాత్రమే కేటాయించారు. అయితే ఎయిరిండియాను పునరుద్ధరించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థ ‘ఎయిరిండియా అస్సెట్​ హోల్డింగ్ లిమిటెడ్’కు రూ.2,205 కోట్లు ఇచ్చారు.

పోర్టులను కార్పొరేటీకరణ చేస్తం

దేశంలోని పోర్టులు మరింత బాగా పనిచేసేలా ఫ్రేమ్​వర్క్​ రూపొందిస్తామని ఫైనాన్స్​ మినిస్టర్​ చెప్పారు. కనీసం ఒక పెద్ద పోర్టును స్టాక్​ ఎక్స్ఛేంజీలో లిస్ట్​చేస్తామని, కార్పొరేట్​ స్థాయికి చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోర్టుల్లో యంత్రాల వినియోగం మరింత పెంచడం, వీలైనన్ని పనులు డిజిటలైజ్​ చేయడం ద్వారా సామర్థ్యాన్ని పెంచుతామన్నారు.

మరిన్ని వెలుగు వార్తలు కోసం క్లిక్ చేయండి